‘ఫోర్బ్స్’లో షారుక్, సల్మాన్, అక్షయ్
న్యూయార్క్: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్–100 సెలబ్రిటీల జాబితాలో భారత స్టార్లు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లకు చోటు దక్కింది. ప్రముఖ అమెరికన్ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ఈ ముగ్గురు ‘టాప్–100’లో స్థానం సంపాదించారు. 2016 జూన్ 1 నుంచి 2017 జూన్ 1 వరకు ఉన్న లెక్కల ప్రకారం జాబితా విడుదల చేశారు.
షారుక్ రూ.245 కోట్లతో 65వ స్థానంలో, సల్మాన్ రూ.238 కోట్ల తో 71వ స్థానంలో, అక్షయ్ రూ.228 కోట్లతో 80వ స్థానంలో నిలిచారు. అమెరికన్ గాయకుడు సీన్ కూమ్బస్ రూ.837 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో నిలవగా.. అమెరికన్ సింగర్ బియోన్స్ రూ.676 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2016 జూన్ 1 – 2017 జూన్ 1 మధ్య కాలంలో టాప్–100 సెలబ్రిటీలు 5.15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33వేల కోట్లు)ను సంపాదించారని ఫోర్బ్స్ పేర్కొంది. జాబితాలో 10 మంది నటులున్నారని, అయితే ఒక్క నటికీ లిస్టులో స్థానం దక్కలేదని వెల్లడించింది. టాప్–100 జాబితాలో 16 శాతం మందే మహిళలున్నారని పేర్కొంది.