గుట్టలు గుట్టలుగా చనిపోయిన షార్క్ లు!
సాధారణంగా షార్క్ లు సముద్రంలో షికారుకు వెళ్లిన వారిపై దాడులు చేయడం గురించి వింటుంటాం. వీటిలో కొన్ని రకాలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి. కానీ మన దగ్గర మార్కెట్లలో చేపలు, రొయ్యలను ఎలాగైతో అమ్మకాలు జరుగుతుంటాయో అదే విధంగా కొన్ని దేశాల్లో షార్క్ లను విక్రయిస్తుంటారు. ఈ మధ్య వీటి దాడులు ఇండోనేషియాలో పెరిగిపోయాయి. ఇండోనేషియా వాసులు మాత్రం సముద్రంలో వేటకు వెళ్లి షార్కులను పట్టి వాటి తాట తీస్తుంటారు. ఈ ఫొటో చూస్తేనే అర్థమవుతోంది. వేలకొద్ది షార్క్ లను గుట్టలు గుట్టలుగా పడిఉండటం చూస్తే ఇది చిన్న తరహా వ్యవహరం కాదు. ప్రపంచంలోనే ఇండోనేషియా మార్కెట్ షార్క్ ఎగుమతులలో ప్రసిద్ది చెందింది. చైనా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్ దేశాలకు నిత్యం వేలకొద్ది షార్క్ లను ఎగుమతి చేస్తుంటారు.
షార్క్లతో ఖరీదైన సూప్ లు!
ఇండోనేషియా, పశ్చిమ జావా ప్రాంతంలో రెండు రోజుల కిందట ఇంద్రమయూ మార్కెట్ లో ఈ దశ్యాలు కనిపించాయి. షార్క్ సూప్ చాలా బాగుంటుందని అక్కడి వారు చెబుతున్నారు. షార్క్ సూప్ ఒక్క బౌల్ దాదాపు రూ.600 ఉంటుంది. ముఖ్యంగా చైనా వాసులు ఈ సూప్ అంటే పడి చచ్చిపోతారట. ఖరీదైన సూప్ తాగటం వారి విలాసవంతమైన జీవనానికి, వారి ఆర్థిక స్థితిగతులకు అద్దం పడుతోంది. షార్క్ లను కొన్ని పద్దతుల్లో ఎండబెట్టి వాటిని కూడా ఇండోనేషియా నుంచి ఎగుమతి చేస్తుంటారు. డ్రై షార్క్ లు ఏడాదిలో కనీపం 486 టన్నులు ఎగుమతి అవుతుంటాయని అధికారులు తెలిపారు. కొందరు జంతు ప్రేమికులు షార్క్ ల వేటపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షార్క్ జాతులు అంతరించి పోతాయని వాదనలు వినిపిస్తున్నాయి.