సివంగి వేటకు బలైంది!
మాటు వేసిన మృత్యువు..
తమ మానాన తాము చెట్ల ఆకులను తింటున్న పిల్ల జిరాఫీలు.. వాటికి రక్షణగా తల్లి జిరాఫీ.. మృత్యువు తమ ముంగిట్లోనే ఉందన్న విషయాన్ని అవి గమనించలేదు.. అంతే.. మాటు వేసిన మృత్యువు ఒక్కసారిగా విరుచుకుపడింది. పిల్ల జిరాఫీని బలిగొంది. ఓ సివంగి జిరాఫీని వేటాడిన ఈ దృశ్యాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన ఫొటోగ్రాఫర్ అంజా క్రూగర్ క్లిక్‌మనిపించారు. అనుకోకుండా తన కెమెరాకు ఈ చిత్రం చిక్కిందని.. చాలా అరుదుగా ఇలాంటి ఫొటోలు తీయగలుగుతామని అంజా తెలిపారు.
‘అప్పటివరకూ ఎలాంటి అలజడి లేదు. జంతువులంతా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఓ సివంగి పొదల చాటున మాటువేసి ఉందన్న విషయాన్ని మేము కూడా గమనించలేదు. ఆ జిరాఫీలు ఆహారం కోసం అక్కడికి వెళ్లాయి. సివంగికి ఆహారమైపోయాయి. అరుదైన చిత్రమైనా.. చాలా బాధాకరమైనది’ అని అంజా అన్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.