పడినా.. పగలదు..
ఎంత కాస్ట్‌లీ ఫోన్ అయినా.. కింద పడిందంటే మటాషే. ముఖ్యంగా స్క్రీన్ వైపు పడిందంటే అది బద్దలు కావాల్సిందే. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంది ఆపిల్. దీనికి సంబంధించి ఇటీవల పేటెంట్‌ను కూడా పొందింది. ఈ కొత్త పరిజ్ఞానం వల్ల ఐఫోన్ లేదా ఐప్యాడ్ వంటివి మన చేతిలోంచి ప్రమాదవశాత్తు జారి పడినప్పుడు ఇందులో ఉండే సెన్సర్లు వెంటనే దాన్ని గుర్తించి.. స్క్రీన్ వైపు పడకుండా.. ఫోన్ నిలువుగా పడేలా చేస్తాయి. అంటే ఫోన్ తాలూకు దృఢమైన భాగం మాత్రమే నేలను తాకేలా చేస్తాయన్నమాట.
అసలిదెలా పనిచేస్తుందంటే..
ఐఫోన్ చేతిలోంచి జారిపోయింది. నేలపై పడనుంది. ఫోన్‌లోని సెన్సర్లు పనిచేయడం ప్రారంభిస్తాయి. స్క్రీన్ వైపు పడేటట్లుంటే.. ఇందులోని మోటారు ఫోన్‌ను దిశను మార్చుతుంది. అంతేకాదు.. హెడ్‌ఫోన్స్ తగిలించి ఉన్నట్లయితే.. కనెక్టర్ దెబ్బతినకుండా ఉండేందుకు.. అవి కనెక్టర్ నుంచి ఊడిపోయేలా చేస్తుంది. ఫోన్ నిలువుగా.. దృఢమైన భాగం మాత్రమే నేలను తాకుతుంది.