
చైనాకు శ్రీలంక షాక్.. భారత్ కోరిక తీరింది
కొలంబో: ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె నేతృత్వంలోని శ్రీలంక కేబినేట్ చైనాకు షాకిచ్చింది. శ్రీలంకలోని హంబన్‌తోటలో చైనా ఓడరేవును నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. హిందూ మహాసముద్రంలో జలరవాణా జరిగే అత్యంత కీలకమైన ప్రదేశంలో చైనా ఓడరేవును నిర్మించడానికి సిద్ధపడటంతో భారత్, జపాన్, అమెరికాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి.
తమకు భద్రతాపరమైన సవాళ్లు ఉంటాయని చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని మరోమారు పరిశీలించుకోవాలని ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు స్ధానిక ప్రజల నుంచి కూడా చైనా విషయంలో శ్రీలంక ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. దీంతో ఓడరేవు ఒప్పందాన్ని రివ్యూ చేసిన శ్రీలంక కేబినేట్.. ఓడరేవుపై చైనాకు ఉండబోయే విస్తృతమైన అధికారాలకు కత్తెర వేసింది. దీంతో భారత్‌కు పొంచి ఉన్న పెను భద్రతా ముప్పు తప్పినట్లయింది.
హంబన్‌తోట ఓడరేవు అంతర్జాతీయ జల మార్గాల దృష్ట్యా అత్యంత కీలకమైనది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ పోర్టును నిర్మించేందుకు చైనా ముందుకు వచ్చింది. నిర్మాణానికి భారీ మొత్తంలో వెచ్చిస్తుండటంతో రేవులో 80 శాతం వాటా చైనాకు ఇచ్చేందుకు శ్రీలంక ఓకే చెప్పింది. ఇరు దేశాలు ఒప్పందపత్రాలపై సంతకాలు కూడా చేశాయి.
ప్రజలు, సామాజిక కార్యకర్తల ఆందోళనలకు తలొగ్గిన శ్రీలంక కేబినేట్.. భద్రతా కారణాల దృష్ట్యా వాణిజ్యానికి సంబంధించి పోర్టులో జరిగే కార్యక్రమాల్లో చైనా అధికారాల పరిధిని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా హంబన్‌తోటలో మిలటరీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుపడదు.
2014లో హంబన్‌తోట ఓడరేవులో చైనా తన సబ్‌మెరైన్‌ను ఉంచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ విషయంపై భారత్, శ్రీలంకతో చర్చలు జరిపింది. ఈ ఏడాది మేలో మరోమారు సబ్‌మెరైన్‌ను ఓడరేవులో ఉంచుతామన్న చైనా ప్రతిపాదనను శ్రీలంక తిరస్కరించింది.
శ్రీలంక కేబినేట్ ఆమోదించిన ప్రతిపాదన ఈ వారంలో ఆ దేశ పార్లమెంటు ముందుకు రానున్నట్లు కేబినేట్ అధికార ప్రతినిధి దయాసిరి జయశేఖర తెలిపారు. అయితే, ప్రతిపాదనలోని అంశాలను ఆయన వెల్లడించలేదు. శ్రీలంక కేబినేట్ నిర్ణయంపై చైనా అధికార ప్రతినిధిని ప్రశ్నించగా.. ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే, రహస్య సమాచారం ప్రకారం.. శ్రీలంక నిర్ణయానికి చైనా ఓకే చెప్పినట్లు తెలిసింది.