ప్రాణాపాయ స్థితిలోనూ పండంటి బిడ్డకు జన్మ..
బ్రిటన్ః నలభై ఏళ్ళ నిండు గర్భిణి... తనపై దాడి జరిగినా పట్టించుకోలేదు. కడుపులో ఉన్న తన పండంటి బిడ్డను కాపాడుకోవడంకోసం తీవ్రంగా ప్రయత్నించింది. ప్రాణాలు పోయే విపత్కర పరిస్థితిలోనూ బిడ్డను కాపాడుకోవడం కోసం పరితపించింది. చివరికి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె మాత్రం ప్రాణాలకోసం పోరాడుతోంది. ఇంగ్లాండ్ వెస్ట్ మిడ్ ల్యాండ్స్ ప్రాంతంలో జరిగిన కిరాతకుడి దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఎప్పుడూ బిజీగా ఉండే సుట్టన్ కోల్డ్ ఫీల్డ్ పట్టణ కేంద్రంలో 41 ఏళ్ళ దుండగుడు ఉన్నట్లుండి ఆమెపై కత్తితో దాడికి దిగాడు. అయితే కత్తిపోట్లకు గురైన ఆమె ఇతరుల సహాయంతో ఆస్పత్రిలో చేరి.. ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించింది. అయితే ఆమె మాత్రం ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్లు వెస్ట్ మిడ్లాండ్ పోలీసులు తెలిపారు. అయితే బాధితురాలు, నేరస్థుడు ఇద్దరూ ఒకరికొకరు తెలిసిన వారేనని, ఇది కుటుంబ తగాదా అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే మరే ఇతర సభ్యులు ఘటన సమయంలో అక్కడ లేకపోవడం, ఆమెపై దాడి జరిగిన కొన్ని సెకన్ల తర్వాత బాధితురాలు అరుపులు వినిపించడంతో దగ్గరలోని వారు రక్షించేందుకు సహాయపడ్డారని వారు తెలిపారు. దీంతో ఒకే ఒక వ్యక్తి దాడికి పాల్పడినట్లు తాము భావిస్తున్నట్లు వెస్ట్ మిడ్లాండ్స్ ఛీఫ్ ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీస్ జూలియన్ హార్పర్ వెల్లడించారు. ఘటన అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసుగా అరెస్టు చేసినట్లు తెలిపారు.
అయితే బాధితురాలిని కాపాడటంలో ఇద్దరు వ్యక్తులకు కూడ స్వల్ప గాయాలవ్వడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరైన సమయంలో ప్రాణాలకు తెగించి, ధైర్యంగా బాధితురాలిని కాపాడిన వారిద్దరికీ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన అనంతరం బిడ్డకు జన్మనిచ్చిందని వెస్ట్ మిడ్లాండ్ అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది తెలిపారు.