సూర్య హీరోగా నటించిన గజిని సినిమా గుర్తుందా! తలకు బలమైన దెబ్బ తగలడంతో ప్రతి 15 నిమిషాలకు తన గతాన్ని హీరో మర్చిపోతుంటాడు. ఇలా నిజంగానే ఓ గజిని ఉన్నాడు. తైవాన్‌లో ఉండే అతని పేరు చెన్(26). సిన్చూ కౌంటీలో ఉంటున్న చెన్‌ను స్థానికులందరూ ‘నోట్‌బుక్ బాయ్’ అని పిలుస్తారు. తొమ్మిదేళ్ల క్రితం ఓ ప్రమాదంలో చెన్ తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో అతనికి షార్ట్‌టైం మెమొరి లాస్ సమస్య ఏర్పడింది.
5 నుంచి 10 నిమిషాల ముందు జరిగిన ఘటనలు మాత్రమే చెన్‌కు గుర్తుంటాయి. అంతకుముందు జరిగిన ఏ విషయమూ చెన్‌కు గుర్తుండదు. దీంతో రోజూ తాను చేసిన పనుల్ని చెన్ అక్షరబద్ధం చేస్తున్నాడు. స్నేహితులతో కబుర్లు, తోటలో పనిచేయడం, మార్కెట్‌లో కూరగాయలు అమ్మడం.. ఇలా తాను చేసిన ప్రతీపనిని చెన్ ఓ పుస్తకంలో రాసిపెట్టుకుంటాడు. ఈ విషయమై చెన్ మాట్లాడుతూ..‘ఓసారి నా పుస్తకాల్లో ఒకటి కనిపించకుండా పోయింది. నేను చాలా బాధలో మునిగిపోయాను.
కన్పించకుండాపోయిన నా నోట్‌బుక్‌ను తెచ్చివ్వాలని నాన్నను అప్పట్లో బ్రతిమాలాను’ అని అన్నాడు. ప్రస్తుతం 26 ఏళ్ల వయస్సున్న చెన్ తన పెంపుడు తల్లి వాంగ్ మియో సియాంగ్(65)తో కలిసి ఉంటున్నాడు. తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం చేసిన కొద్దిపాటి సాయానికి తోడు తమకున్న భూమిలో పండ్లు, కూరగాయలు సాగుచేస్తూ చెన్, అతని తల్లి జీవిస్తున్నారు. ఇంతకాలం తాను తోడుగా ఉన్నప్పటికీ, తానుపోయాక చెన్‌ను చూసుకునే వారు ఎవరూ లేరని తల్లి ఆందోళన చెందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment