
మేసాయ్: థాయిలాండ్‌లోని గుహలో చిక్కుకున్న 12 మంది బాలురు, వారి సాకర్ కోచ్‌ను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు వాతావరణం ప్రతికూలంగా మారింది. వరదల ఉధృతి మరింత పెరగడంతో వారు గుహను ఆనుకుని ప్రవహిస్తున్న ఇరుకైన జలాశయం గుండా ఈదుకుంటూ బయటపడటం మినహా, ప్రస్తుతానికి మరో మార్గంలేదని అధికారులు తెలిపారు. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని కూడా తేల్చారు.
జూన్ 23న మ్యాచ్ ముగిసిన తరువాత వారు చియాంగ్ రాయ్ ప్రావిన్స్‌లో విహార యాత్రకు వెళ్లి, వరదల కారణంగా గుహలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం జరుగుతున్న అన్వేషణ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 11–16 ఏళ్ల మధ్యనున్న ఆటగాళ్లు, 25 ఏళ్ల కోచ్ క్షేమంగానే ఉన్నారని, అయితే ప్రతికూల వాతావరణం వల్లనే బయటికి తీసుకురావడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్న నేవీ సిబ్బంది, వైద్యులు వారికి ఆహారం, అందిస్తున్నారు.