ఓ పక్క దేశానికి రాజు మరో పక్క మెకానిక్! | The king of the country, on the other hand he is a mechanic | Sakshi
Sakshi News home page

ఓ పక్క దేశానికి రాజు మరో పక్క మెకానిక్!

Published Fri, Apr 8 2016 4:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

ఓ పక్క దేశానికి రాజు మరో పక్క మెకానిక్!

ఓ పక్క దేశానికి రాజు మరో పక్క మెకానిక్!

బెర్లిన్: ఎవరైనా ఏకకాలంలో పరస్పర భిన్నమైన జీవితాలను గడపడం చరిత్రలోనే అరుదు. అందులో రాజభోగాలు అందుబాటులో ఉండే ఓ దేశానికి రారాజుగా, మరో దేశంలో కష్టపడి పనిచేసే కారు మెకానిక్‌గా జీవించడమనేది అసలు ఉండదు. కానీ పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశం రాజు సెఫాస్ కోసి బాన్సా, పార్ట్ టైమ్ రాజుగాను, జర్మనీలో ఫుల్‌టైమ్ కారు మెకానిక్‌గాను పనిచేస్తున్నారు. వృత్తికి అంకితమై పనిచేసే వ్యక్తిగా జర్మనీ కస్టమర్ల ప్రశంసలు అందుకుంటున్న బాన్సా, ‘స్కైప్’ ద్వారా రాజ్యపాలను కొనసాగిస్తూ ఘనా ప్రజల మన్ననలను అందుకుంటున్నారు.

జర్మనీలోని లుద్విగ్‌షాఫెన్‌లో సొంతంగా కారు మెకానిక్ షెడ్‌ను నడుపుతూ కుటుంబ జీవితాన్ని గడుపుతున్న  67 ఏళ్ల బాన్సాకు తూర్పు ఘనాలో పెద్ద రాజ ప్రాసాదమే ఉంది. ఆయన్ని అక్కడ ‘కింగ్ టోంగ్బే ఎన్‌గోరిఫియా సెఫాస్ కోసి బాన్సా’ అని వ్యవహరిస్తారు. అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. మొత్తం 20 లక్షల మంది ప్రజలకు ఆయన పాలకుడు. ఆయన రాజ ప్రాసాదం ఉన్న నగరంలోనే మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.

బాన్సా రాజు కాకముందే 1970లో చదువుకోసం జర్మనీ వచ్చారు. మంచి నైపుణ్యం గల మెకానిక్ కావాలంటూ తండ్రి ప్రోత్సహించడంతో బాన్సా చదువు పూర్తికాగానే మెకానిక్‌గా స్థిరపడ్డారు. 1987 వరకు ఆయన జీవితం ఓ మెకానిక్‌గా సాఫీగానే సాగిపోయింది. అప్పుడే ఆయనకు ఘనా రాజ ప్రాసాదం నుంచి అర్జెంట్‌గా రావాల్సిందిగా కబురు వచ్చింది. అప్పటి వరకు రాజుగా కొనసాగిన బాన్సా తాత కింగ్ ఆఫ్ హోహో మరణించారు. బాన్సాకు అప్పటికీ తండ్రి, ఓ అన్నయ్య ఉన్నారు. అయితే వారిద్దరు ఎడమ చేతి వాటంగాళ్లు అవడంతో రాచరిక సంప్రదాయం ప్రకారం వారు సింహాసనానికి అనర్హులయ్యారు. దాంతో సింహాసనం వారుసుడిగా బాన్సా ఎంపికయ్యారు. రాజుగా పట్టాభిషేకం జరిగింది. ఆనవాయితీగా ఆధ్యాత్మిక గురువుగా కూడా బాధ్యతలు స్వీకరించారు.

ఎవరైనా రాజు బాధ్యతలు స్వీకరించాక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. పాత జీవితాన్ని తృణప్రాయంగా తిరస్కరిస్తారు. కానీ బాన్సాకు తాను ఎంతోకాలంగా చేస్తున్న మెకానిక్ వృత్తిని వీడాలనిపించలేదు. అప్పటి నుంచి రెండు విధులను నిర్వహిస్తున్నారు. ఏడాదికి ఎనిమిది సార్లు ఘనాకు వెళ్లి వస్తుంటారు. మిగతా సమయాల్లో స్కైప్ ద్వారా తన సలహాదారులలో సంప్రదింపులు జరుపుతూ పాలనా వ్యవహారలాను చూస్తున్నారు. ఘనాలో ప్రస్తుతం డెమోక్రటిక్ వ్యవస్థ ఉన్నప్పటికీ రాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అన్ని ఎయిడెడ్ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇప్పటికే ఘనాలో ఎన్నో పాఠశాలలను కట్టించిన బాన్సా ప్రస్తుతం ఘనాలో మహిళల కోసం ప్రత్యేక జైలును నిర్మించేందుకు ఆయన అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తున్నారు.

బాన్సాకు భార్య గాబ్రియెల్ బాన్సా (57), ఇద్దరు పిల్లలు కార్లో, క్యాథరినాలు ఉన్నారు. 16 ఏళ్ల క్రితం బాన్సా వివాహం రాయల్ స్టేటస్ ప్రకారమే జరిగింది. ఆయనతోపాటు ఘనా వెళ్లి మొన్ననే తిరిగొచ్చిన జర్మనీ ఫొటోగ్రాఫర్ ఒకరు ఈ విషయాలను తోటి మీడియాతో పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement