వేడిని విద్యుత్తుగా మార్చే పదార్థం
వృథా అవుతున్న వేడిని శక్తిగా మార్చే వినూత్నమైన పదార్థాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. తద్వారా థర్మల్ పవర్ ప్లాంట్లు మొదలుకుని సామాన్య వాహనాల వరకూ అన్నింటితో అదనంగా విద్యుదుత్పత్తి చేసే సౌకర్యం ఏర్పడనుంది. వాహనాల్లో లీటర్ పెట్రోలు పోస్తే అందులో ప్రయాణానికి ఉపయోగపడేది 20 శాతం మాత్రమే. మిగిలినదంతా వేడి రూపంలో వృథా అవుతుంటుంది. బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్లలో అయితే ఈ వృథా 50 నుంచి 60 శాతం వరకు ఉంటుంది.
దీంట్లో ఏ కొంచెం మొత్తాన్ని తిరిగి విద్యుత్తుగా మార్చగలిగినా ఎంతో ప్రయోజనముంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పర్‌డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నానోస్థాయి టంగ్‌స్టన్, హఫీనియం ఆక్సైడ్‌లతో వేడిని విద్యుత్తుగా మార్చే పదార్థాన్ని తయారు చేశారు. సోలార్ సెల్స్ సూర్యకిరణాల్లోని శక్తిని ఎలాగైతే విద్యుత్తుగా మారుస్తాయో.. ఈ థర్మోవోల్టాయిక్ పదార్థం వేడిని విద్యుత్తుగా మారుస్తుందన్నమాట.