
భూమంత వజ్రం!
వజ్రం కొనాలి.. ఎంత పెద్దది.. పది క్యారెట్లో, ఇరవై క్యారెట్లో మహా అయితే వంద క్యారెట్లో..! మరి ఏకంగా భూమంత పెద్ద వజ్రం దొరికితే!? బాగానే ఉంటుందిగానీ..
వాషింగ్టన్: వజ్రం కొనాలి.. ఎంత పెద్దది.. పది క్యారెట్లో, ఇరవై క్యారెట్లో మహా అయితే వంద క్యారెట్లో..! మరి ఏకంగా భూమంత పెద్ద వజ్రం దొరికితే!? బాగానే ఉంటుందిగానీ.. అంతపెద్ద వజ్రం ఉంటుందా అని సందేహం వచ్చిందా.. ఇది నిజమే! భూమికి 900 కాంతి సంవత్సరాల దూరంలో పీఎస్‌ఆర్ జే2222-0137 అనే నక్షత్రం చుట్టూ ఈ వజ్రం తిరుగుతోంది. అమెరికాకు చెందిన విస్కోసిన్ వర్సిటీ శాస్త్రవేత్త డేవిడ్ కల్పన్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ, గ్రీన్‌బ్యాంక్ టెలిస్కోప్, వెరీ లాంగ్ బేస్‌లైన్ అర్రే తదితర టెలిస్కోపుల సహాయంతో ఈ వజ్రాన్ని గుర్తించింది.
అసలు ఈ వజ్రం కూడా ఒకప్పుడు చిన్న నక్షత్రమే. చిన్న నక్షత్రాలు హైడ్రోజన్ అంతా మండిపోయి వైట్‌డ్వార్ఫ్‌లుగా మారుతాయి. ఈ వైట్‌డ్వార్ఫ్‌ల్లో కొన్ని చల్లబడిన తర్వాత వాటిలోని కార్బన్ స్పటిక రూపాన్ని సంతరించుకుని వజ్రంగా మారుతాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు గుర్తించినది కూడా ఈ తరహాదే. అసలు.. భూమ్మీద ఇప్పటివరకూ దొరికిన అతిపెద్ద వజ్రం కల్లినాన్.. దీని బరువు కూడా 3,106 క్యారెట్లు అంటే 622 గ్రాములు మాత్రమే తెలుసా.