సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు మరింత ఉధృతం కానుంది. ఇటీవల టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వివాదం రేపగా, తాజాగా పాక్ ట్వీట్‌తో కన్నడ రాజకీయం మరింత వేడెక్కింది. టిప్పు సుల్తాన్‌ను ‘టైగర్ ఆఫ్ మైసూర్’గా అభివర్ణిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం ట్వీట్ చేసింది. టిప్పు సుల్తాన్ 218 వర్థంతి సందర్భంగా ‘టిప్పు సుల్తాన్ టైగర్ ఆఫ్ మైసూర్... ముస్లిం మైసూర్ పాలకుడు ప్రతిభావంతమైన చారిత్రాత్మక వ్యక్తి టిప్పు సుల్తాన్ (బాద్‌షా నసీబుద్దౌలా సుల్తాన్ ఫతే అలీ బహాదూర్ సాహెబ్)’ గా పాకిస్తాన్ ట్వీట్ చేసింది.
దీనిపై స్పందించిన బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధిచేకూర్చడం కోసమే పాకిస్తాన్ ఈ విధంగా ట్వీట్ చేసిందని ఆరోపించింది. బ్రిటిష్ సామ్రాజాన్ని టిప్పు సుల్తాన్ దైర్యంగా ఎదుర్కొని, వీరోచితమైన పోరాటం చేశాడని చరిత్రాకారుల అభిప్రాయం. స్వాతంత్య్ర పోరాటంలో టిప్పు సుల్తాన్ కృషి ఎంతో ఉందని చరిత్రకారులు చెప్తుంటారు. కాగా టిప్పు సుల్తాన్ పోరాటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చరిత్రకారుల సమాచారం ప్రకారం టిప్పు సుల్తాన్ 1750, నవంబర్ 20న మైసూర్‌లో జన్మించి, 1799 మే 4న బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి 49 ఏళ్ల వయస్సులో వీరమరణం పొందారని చెప్తున్నారు.
పాకిస్తాన్‌కి టిప్పు సుల్తాన్‌కి ఎలాంటి సంబంధం లేదని, ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయడానికే పాకిస్తాన్ ఈ చర్యకు తెగబడిందని బీజేపీ ఆరోపిస్తోంది. టిప్పు సుల్తాన్ జయంతోత్సవాలను ప్రతిఏటా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2015లో ప్రకటించిన తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్దమే జరిగింది. సిద్దరామయ్య నిర్ణయం పట్ల బీజేపీతో సహా పలుసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి.
టిప్పు జయంతోత్సవాల్లో ఎవ్వరూ పాల్గొనవద్దని, మంగుళూరులో కాథలిక్కులను దారుణంగా చంపిన ఉగ్రవాదిగా బీజేపీ టిప్పును వర్ణించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించి ముస్లింలను ఆకర్షించాలని భావిస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment