చందమామకు ఆవలి వైపు...
చందమామను మన ం ఎప్పుడూ ఒకేవైపు చూస్తుంటాం. భూమి ఆకర్షణ శక్తి వల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూనే 29.5 రోజులకు ఓసారి భూమి చుట్టూ తిరగడం వల్ల.. మనకు ఎప్పుడూ ఒకవైపే కనిపిస్తుంటాడు. నల్లటి మచ్చలు.. ముసలమ్మ.. ఓ కుందేలు.. ఎవరికిష్టమైనవి వారు ఊహించేసుకుంటున్నాం. అయితే.. చందమామ ఆవలి ముఖంపై ఏముంది? అన్న మిస్టరీ వీడిపోయి శనివారం నాటికి 55 ఏళ్లు అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో.. చంద్రుడి అవతలి వైపు రూపానిదే. చంద్రుడి అవతలి రూపాన్ని 1959, అక్టోబర్ 4న రష్యన్ వ్యోమనౌక లూనా-3 ఫొటో తీసింది.
అంతరిక్షంలోకి తొలి ఉపగ్రహం ‘స్పుత్నిక్’ను పంపి రెండేళ్లు అయిన సందర్భంగా.. రష్యా లూనా-3ని నింగికి పంపింది. కానీ.. లూనా-3లో ఉన్న కెమెరా ఫిల్మ్ డెవలప్‌మెంట్ వ్యవస్థ అనుకున్నంత బాగా పనిచేయలేదు. రేడియో తరంగాల ద్వారా చిత్రాలను భూమికి పంపడంలోనూ నాణ్యత దెబ్బతిని మొత్తానికి అస్పష్ట చిత్రాలు.. తర్వాత ఎట్టకేలకు స్పష్టమైన చిత్రాలు అందాయి. ఇంకేం.. చంద్రుడి అవతలి రూపాన్ని చూసిన పదేళ్లకే మనిషి అక్కడ పాదం మోపాడు!