భారీగా ట్విట్టర్ ఎకౌంట్ల తొలగింపు
న్యూయార్క్: ఉగ్రవాద చర్యలను నియంత్రించే క్రమంలో మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్.. ట్వట్టర్ కఠినమైన చర్యలు చేపడుతోంది. తీవ్రవాదాన్ని ప్రమోట్ చేస్తున్నారన్న కారణంతో భారీ సంఖ్యలో ఎకౌంట్‌లను సస్పెండ్ చేస్తోంది. గత ఆరునెలల కాలంలో 2,35,000 ఎకౌంట్‌లను ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీంతో గత ఏడాది కాలంగా ట్విట్టర్ తొలగించిన ఖాతాల సంఖ్య 3,60,000కు చేరింది. ప్రాధమికంగా ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించిన 1,25,000 ఖాతాలను 2016 ప్రారంభంలో ట్విట్టర్ సస్పెండ్ చేసింది.
ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటున్న క్రమంలో వారికి ట్వట్టర్ ప్రధాన ఆయుధంగా మారిందని గతంలో విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన ట్విట్టర్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఉగ్రవాద సంభాషణలకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించి.. అలాంటి అకౌంట్‌లను తొలగించే పటిష్టమైన చర్యలను ట్విట్టర్ చేపడుతోంది.