
యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ (ఇన్ సెట్‌లో కథువా బాధితురాలు)
న్యూయార్క్ : కథువా చిన్నారి హత్యాచార ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. దీనిని భయానక ఘటనగా అభివర్ణించిన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఘాతుకానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘మీడియాలో వచ్చిన కథనాలు నన్ను కదిలించాయి. ఓ పసి ప్రాణాన్ని అతి భయంకర రీతిలో చిత్రవధలకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అలాంటి మానవ మృగాలను క్షమించకూడదు. చట్టపరిధిలో వారిని(గరిష్ఠ శిక్ష ఆధారంగా..) కఠినంగా శిక్షించి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నా’ అని గుటెర్రెస్ తన సందేశంలో పేర్కొన్నారు. దీనిని ఆయన ప్రతినిధి స్టీఫెన్ దుజ్జారిక్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.
కథువా జిల్లాలో నొమాదిక్ బకర్‌వాల్ ఇస్లాం తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జనవరి 10న అదృశ్యం కాగా.. వారం తర్వాత ఆమె మృత దేహం ఛిద్రమై కనిపించింది. పోస్ట్ మార్టం నివేదికలో ఆమెను అతిక్రూరంగా చెరిచి చంపినట్లు నిర్ధారణ కావటంతో కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ఘటనలో మరిన్ని వివరాలు ఇప్పుడు వెలుగులోకి రావటంతో.. దేశవ్యాప్తంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.