వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టుతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయంతో అమెరికా ఏకీభవించింది. దెబ్బతిన్న సంబంధాలను వీలైనంత త్వరగా మళ్లీ బలోపేతం చేసే అంశంపై తాము దష్టి పెట్టామని వెల్లడించింది. దేవయాని వ్యవహారంలో విదేశాంగ మంత్రి పశ్చాత్తాప పడ్డట్లు ఆ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘‘రెండు దేశాలూ కలిసి ముందుకు సాగాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా సంబంధాలను వేగవంతంగా బలోపేతం చేసేందుకు మేం యత్నిస్తున్నాం’’ అని హార్ఫ్ చెప్పారు. దేవయానికి అవసరమైన దౌత్య రక్షణ కల్పించేలా ఐక్యరాజ్యసమితికి ఆమెను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి నుంచి తమకు లేఖ వచ్చిందని, అవసరమైన ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.