వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టుతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయంతో అమెరికా ఏకీభవించింది. దెబ్బతిన్న సంబంధాలను వీలైనంత త్వరగా మళ్లీ బలోపేతం చేసే అంశంపై తాము దృష్టి పెట్టామని వెల్లడించింది. దేవయాని వ్యవహారంలో విదేశాంగ మంత్రి పశ్చాత్తాప పడ్డట్లు ఆ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రెండు దేశాలూ కలిసి ముందుకు సాగాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా సంబంధాలను వేగవంతంగా బలోపేతం చేసేందుకు మేం యత్నిస్తున్నాం’’ అని హార్ఫ్ చెప్పారు. దేవయానికి అవసరమైన దౌత్య రక్షణ కల్పించేలా ఐక్యరాజ్యసమితికి ఆమెను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి నుంచి తమకు లేఖ వచ్చిందని తెలిపారు.
దేవయాని వీడియో బూటకం: దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు బట్టలు విప్పి తనిఖీ చేస్తున్నట్లుగా వివిధ వెబ్‌సైట్లలో కనిపించిన, సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న సీసీటీవీ వీడియో బూటకమైనదని మేరీ హార్ఫ్ చెప్పారు. ‘‘ఆ వీడియో ఎంతమాత్రమూ ఖోబ్రగడేది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన, రెచ్చగొట్టేటువంటి కల్పితమైన వీడియో’’ అని చెప్పారు. అమెరికా పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక మహిళ ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై విదేశాంగ అధికారులు అమెరికా మార్షల్ సర్వీస్ విభాగంతో మాట్లాడారని, ఆ వీడియో దేవయానిది కాదని వారు నిర్ధారించారని మేరీ హార్ఫ్ చెప్పారు. అసలు ఆ వీడియోలో ఉన్నది అమెరికా మార్షల్స్ కాదని, ఆ వీడియోలో కనిపించిన తనిఖీ పద్ధతి కూడా అమెరికా మార్షల్స్ పాటించే విధానంలో లేదని వారు ధ్రువీకరించినట్లు చెప్పారు.
అమెరికా సెంటర్‌లో సినిమాలు ప్రదర్శించవద్దు: భారత్
న్యూఢిల్లీ: దేవయాని వ్యవహారంలో అమెరికాపై ఒత్తిడి పెంచే దిశగా భారత్ మరో చర్య తీసుకుంది. ఎలాంటి లెసైన్సు పొందకుండా ‘అమెరికా సెంటర్’లో సినిమాలు ప్రదర్శించవద్దని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 20 వరకు గడువిచ్చింది. ఢిల్లీలోని ‘అమెరికా సెంటర్’ ఎలాంటి లెసైన్సు లేకుండానే ఇక్కడ సినిమాలు ప్రదర్శిస్తుంటుంది. ఇంతకాలం దీనిపై నోరు మెదపని ప్రభుత్వం తాజాగా.. ఆ ప్రదర్శనలు నిలిపేయాలంటూ నోటీసులు పంపింది.
రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి:అమెరికా
Published Sun, Jan 5 2014 1:49 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement