
ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకు వచ్చింది. మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై పోరాడేందుకు 64 దేశాలకు కలిపి మొత్తంగా 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్ డాలర్ల సహాయానికి శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీ అదనం. ఈ క్రమంలో అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) సహా ఇతర సంస్థలకు ఈ గ్లోబల్ ప్యాకేజీ ద్వారా నిధులు సమకూరనున్నాయి. ఇందులో భాగంగా అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి 2.9 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సహాయం అందనుంది. కరోనాపై పోరుకు సన్నద్ధమయ్యేందుకు భారత్‌లో ల్యాబ్‌ల అభివృద్ధి, కరోనా కేసులపై నిరంతర పర్యవేక్షణ, ఇందుకు సంబంధించిన సాంకేతికత అభవృద్ధికై ఈ సహాయం అందజేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.(కరోనా నివారణకు రూ.1500 లక్షల కోట్లు!)
ఈ సందర్భంగా అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఏఐడీ) డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ బోనీ గ్లిక్ మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు చేసే సహాయంలో అమెరికా సరికొత్త రికార్డును నెలకొల్పిందన్నారు. ‘‘ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నో దశాబ్దాలుగా అమెరికా ప్రపంచ దేశాలకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంది. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. వివిధ జాతులు, వర్గాల ప్రజలను కాపాడుకునేందుకు వీలుగా ఆరోగ్య సంస్థలను నెలకొల్పేందుకు సహాయం అందించింది’’ అని పేర్కొన్నారు. ఇక అమెరికా ప్రకటించిన గ్లోబల్ ప్యాకేజీ ద్వారా శ్రీలంకకు 1.3 మిలియన్ డాలర్లు, నేపాల్‌కు 1.8 మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్‌కు 3.4 మిలియన్ డాలర్లు, అఫ్గనిస్తాన్‌కు 5 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి.(అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు?)
Comments
Please login to add a commentAdd a comment