
వాషింగ్టన్: మెక్సికో నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఆశ్రయాన్ని నిరాకరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. ఈ నెల మొదట్లో ట్రంప్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ టిగార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమెరికాలోకి అధికారికంగా ప్రవేశించి ఆశ్రయం కోరిన శరణార్థుల విజ్ఞప్తులనే పరిశీలించాలని ట్రంప్ అప్పటి ఆదేశాల్లో పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం వలసల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పౌరహక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ట్రంప్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది.