జిహాదీలను ఎదిరించి, సైన్యాన్ని రక్షించిన శునకం!
లండన్ః బ్రిటిష్ సైన్యాన్ని రక్షించిన మిలటరీ డాగ్ ఇప్పుడు వార్తల్లో హీరో అయిపోయింది. ఏభైమంది ఐసిస్ సమూహాన్ని దీటుగా ఎదుర్కొని బ్రిటిష్ ప్రత్యేక దళాలపై విశ్వాసాన్ని చూపింది. సాస్ సైనికులు పది రోజుల ట్రైనింగ్ అనంతరం తిరిగి వస్తుండగా.. ఫైటర్లనుంచి రక్షించి ప్రత్యేకతను చాటింది.
నాలుగు వాహనాల కాన్వాయ్ లో బ్రిటిష్ సైనిక దళాలతో పాటు ప్రయాణిస్తున్న అల్సేషన్ డాగ్... కుర్షిద్ సరిహద్దు ప్రాంతంలోకి రాగానే అనుకోకుండా జిహాదీల సమూహానికి చిక్కారు. గతనెల్లో సుమారు ఏభైమంది ఐసిస్ సభ్యులు ఓ హోం మేడ్ బాంబుతో సైన్యంపై దాడికి దిగారు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన బ్రిటిష్ సైన్యంపై వెనుకనుండి దాడి చేశారు. అదే సమయంలో కాన్వాయ్ లో సైనికులతో పాటు ప్రయాణిస్తున్న మిలటరీ డాగ్ తన ప్రతాపం చూపింది. కోపంతో ఉగ్రరూపం దాల్చింది. ఐసిస్ దళాలపై విరుచుకు పడింది. ఓ జిహాదీని మైడపైనా, ముఖంపైనా కరిచింది. మరో జిహాదీ చేతులు, కాళ్ళను పట్టుకు పీకేసింది. ఆల్సేషన్ కుక్క టెర్రర్ కు ఐసిస్ సభ్యులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీశారు. కుక్క భయానికి అక్కడినుంచీ పారిపోయారు.
ఐసిస్ దాడులనుంచి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోకుండా.. ఆ కుక్క వీరోచితంగా పోరాడి తమ సైనికులను రక్షించడం అభినందించాల్సిన విషయమని, అందుకు దానికి ఎంతో తర్ఫీదు ఇచ్చి ఉంటారని ఘటన అనంతరం అంతా మెచ్చుకున్నారు. ఆల్సేషన్ దగ్గరకు వస్తే సాధారణ మనుషులైతే భయపడతారు. కానీ జిహాదీలను సైతం తీవ్రంగా భయపెట్టి, వారిని దీటుగా ఎదుర్కొని తన బాధ్యతను నిర్వర్తించడం నిజంగా ఆశ్చర్యకరమని అంటున్నారు.