సైకిల్‌పై దేశమంతా తిరగడం ఇప్పటిదాకా చాలా మంది చేశారు. మరి దేశాలు తిరిగినవారి గురించి విన్నారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 దేశాలు.. 29వేల కిలోమీటర్లు..! ఈ ఘనత సాధించింది ఏ కండలు తిరిగిన యువకుడో కాదు.. నిండా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి. అతితక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్‌పై ప్రయాణించిన తొలి ఏషియన్‌గా రికార్డు కూడా సాధించింది. వివరాల్లోకెళ్తే..
నాలుగేళ్ల క్రితం సరదాగా సైకిల్‌పై సుదూర ప్రయాణం చేద్దామని నిర్ణయించుకుంది. కానీ అప్పుడు కుదరలేదు.. చివరికి ఈ ఏడాది తన సరదా తీర్చుకునేందుకు సైకిల్‌పై ప్రయాణాన్ని మొదలుపెట్టి, కేవలం 159 రోజుల్లో 14 దేశాలను చుట్టేస్తూ 29 వేల కిలోమీటర్లు పూర్తిచేసింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్‌గా నిలిచిన ఆ యువతి వేదాంగి కులకర్ణి.
అందరిలా కాకుండా..
పుణేకు చెందిన వేదాంగి.. ఉండేది మాత్రం యూకేలో. అక్కడ బౌర్నెమౌత్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేస్తోంది. ఎప్పుడూ సాహసాలు చేయడం.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటం ఆమెకు ఇష్టం. అందుకే 130 రోజుల్లో 29 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కాలని నిర్ణయించుకుంది. అయితే మధ్యలో తలెత్తిన కొన్ని అవాంతరాలవల్ల తన లక్ష్యాన్ని 159 రోజుల్లో పూర్తిచేసింది.
ప్రాణాలను లెక్కచేయక..
కెనడాలో ప్రయాణిస్తున్నప్పుడు వేదాంగిని ఓ ఎలుగుబంటి వెంబడించింది. దాని నుంచి ఎలాగోలా తప్పించుకుంది. ఇక స్పెయిన్‌లో దోపిడీ దొంగలు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి ఉన్నదంతా దోచుకున్నారు. –20 డిగ్రీల చలిని, 37 డిగ్రీల ఎండనూ తట్టుకుంది. ప్రాణాలకు తెగించి తన లక్ష్యాన్ని చేరుకుంది.
పెర్త్‌లో ప్రారంభం..
పెర్త్‌లో తన సైకిల్ యాత్రను ప్రారంభించి... ఆస్ట్రేలియా నుంచి బ్రిస్బేన్ ద్వారా న్యూజిలాండ్ వెళ్లింది. అక్కడ కెనడాకు విమానంలో వెళ్లి కెనడాలోని హలీఫాక్స్ నుంచి మళ్లీ సైకిల్ యాత్రను కొనసాగించింది. అక్కడి నుంచి ఐస్‌లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, డెన్‌మార్క్, స్వీడన్, ఫిన్‌లాండ్, రష్యా వెళ్లి అక్కడి నుంచి విమానంలో వచ్చి.. ఇండియాలో 4000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసింది. అలా తన యాత్రను ఇండియాలో ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment