మనమూ ‘చిప్’మాన్ అవొచ్చు!
- ‘బ్రెయిన్ చిప్’కు అమెరికా న్యూరోసైంటిస్టు రూపకల్పన
- చిప్‌తో దీర్ఘకాల జ్ఞాపకశక్తి
కాలిఫోర్నియా: మనుషుల శరీరాల్లో చిప్‌లను అమర్చి వారితో అద్భుతాలు సృష్టించటాన్ని హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం. దీన్ని నిజం చేసే దిశగా.. జ్ఞాపకాలను దీర్ఘకాలం పదిలంగా ఉంచే ‘బ్రెయిన్ చిప్’కు కాలిఫోర్నియా వర్సిటీ న్యూరోసైంటిస్టు థియోడర్ బర్జర్ రూపకల్పన చేశారు. దీన్ని కోతులు, ఎలుకలపై విజయవంతంగా పరీక్షించారు. మరికొన్ని పరీక్షలు చేసి.. మార్కెట్లోకి అందుబాటులోకి తేచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.
అల్జీమర్స్‌పై ప్రయోగంతో మొదలై..
మతిమరపు(అల్జీమర్స్) బాధితులను ఆదుకోవాలనే సంకల్పంతో 20 ఏళ్ల క్రితం బర్జర్ ప్రయోగం మొదలైంది. ఇందులో భాగంగానే మెదడు మార్పిడి చికిత్సపైనా వివిధ ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల నుంచి పుట్టిందే ‘బ్రెయిన్ చిప్’. మూర్ఛ వ్యాధిగ్రస్తులపై ఈ చిప్‌ను పరీక్షిస్తున్నారు. ప్రాథమికంగా మనుషులపైనా మంచి ఫలితాలొస్తున్నాయని బర్జర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు విలువ రూ 655 కోట్లు. ఈ చిప్‌లో ఉండే సాఫ్ట్‌వేర్.. స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాల జ్ఞాపకాలుగా మార్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం మెదడు సంకేతాల ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ను యూనిక్‌కోడ్‌గా మారుస్తుంది. ఇదంతా సహజంగా దీర్ఘకాల జ్ఞాపకాలను గుర్తుంచుకునే పద్ధతిలోనే కొనసాగుతుంది. కావాల్సినపుడు క్షణాల్లోనే ఆ జ్ఞాపకాలను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో తిరిగి మెదడుకు అందిస్తుంది.