ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తారు?
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై తాను జారి చేసిన ట్రావెల్ నిషేధ ఉత్తర్వులను పునరుద్ధరించేందుకు ఫెడరల్ అప్పీళ్ల కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ట్రంప్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సిరియా, ఇరాన్, ఇరాక్, సూడాన్, యెమెన్, లిబియా తదితర ఏడు దేశాలపై ట్రంప్ ట్రావెల్ నిషేధ ఉత్తర్వులు జారీ చేయడం, దాన్ని ఫెడరల్ కోర్టు కొట్టివేయడంతో ట్రంప్ ప్రభుత్వం అప్పీళ్ల కోర్టుకు ఆశ్రయించింది. ఇప్పుడు అప్పీళ్ల కోర్టులో కూడా ట్రంప్‌కు చుక్కెదురైంది. ఈ పరిస్థితుల్లో తమ ప్రభుత్వానికి నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, వాటిలో దేన్ని ఆశ్రయించాలన్న అంశంపై కసరత్తు జరుగుతోందని అమెరికా న్యాయశాఖ ప్రకటించింది.
1. నేరుగా సుప్రీం కోర్టుకెళ్లడం
ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ ప్రభుత్వం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. అది కొంత కష్టమైన మార్గం. ఎందుకంటే సుప్రీం కోర్టులో నలుగురు కన్జర్వేటివ్ జడ్జీలు, నలుగురు లిబరల్ జడ్జీలు ఉన్నారు. తొమ్మిదవ పదవి ఖాళీగా ఉంది. దానికి నీలి గార్సచ్ అనే జడ్జీని ట్రంప్ నామినేట్ చేశారు. అయితే పదవి ధ్రువీకరణ జరిగి బాధ్యతలు స్వీకరించేందుకు చాలా సమయమే పట్టే అవకాశం ఉంది.
2. అప్పీల్ చేసుకోవడం
ప్రస్తుతం ఫెడరల్ అప్పీళ్లలో కోర్టులో త్రిసభ్య బెంచీలోనే ట్రంప్ ఉత్తర్వులపై విచారణ జరిగింది. ఈసారి ఫుల్ బెంచీ, అంటే 11 మంది జడ్జీలుండే బెంచీకి అప్పీల్ చేసుకోవచ్చు. వారు కేసును మొదటి నుంచి విచారించి కొత్త ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది.
3. మళ్లీ సియాటెల్ కోర్టుకు వెళ్లే అవకాశం
సియాటెల్‌లో వారం రోజుల క్రితం ట్రంప్ నిర్ణయాన్ని అడ్డుకున్న ఫెడరల్ జడ్జీ వద్దకే మళ్లీ వెళ్లవచ్చు. అప్పుడాయన 14 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సిన ప్రాథమిక తీర్పు కిందనే ట్రంప్ నిర్ణయాన్ని కొట్టివేశారు. దానిపై ఇంజెక్షన్ తీసుకొని ఈసారి పూర్తి స్థాయిలో విచారణ కోరవచ్చు. అప్పుడు వెలువడే తీర్పుపై కూడా అప్పీళ్లకు సుప్రీం కోర్టు వరకు వెళ్లవచ్చు.
4. మళ్లీ అధికారిక ఉత్తర్వులు ఇవ్వొచ్చు
ట్రంప్ జారీ చేసిన ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులో ఉన్న లోపాలను సవరించి మళ్లీ కొత్త ఉత్తర్వులను ఇవ్వొచ్చు. ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న ఈ ఏడు దేశాల ప్రజలకు కూడా ప్రస్తుతం జారీ చేసిన ట్రావెల్ ఉత్తర్వులు వర్తించేలా ఉన్నాయి. అలా కాకుండా ఈ ఏడు దేశాల నుంచి అమెరికాకు వచ్చే కొత్త ప్రయాణీకులకు మాత్రమే ఉత్తర్వులు వర్తించేలా సవరిస్తే సరిపోతుంది. ఇంటా బయటా విమర్శలు వచ్చిన నేపథ్యంతో ఇదే సరైనా పరిష్కారమార్గమని న్యాయసలహాదారులు కూడా ట్రంప్‌కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.