డెస్క్టాప్ మీదకూ వాట్సప్!!
ఫేస్బుక్ను సైతం తలదన్ని, యువత క్రేజును విపరీతంగా సంపాదించుకున్న వాట్సప్ అప్లికేషన్.. ఇక త్వరలోనే డెస్క్టాప్ కంప్యూటర్లకు కూడా రాబోతోంది. ఇప్పటివరకు కేవలం స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లకు మాత్రమే పరిమితమైన వాట్సప్.. డెస్క్టాప్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లకు కూడా అనుగుణంగా సిద్ధం అయిపోతోంది. ఈ విషయం అధికారికంగా ఇంతవరకు స్పష్టం కాలేదు గానీ.. ఈ దిశగా ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయట. డెస్క్టాప్ వెర్షన్ కోసం కోడ్ సిద్ధం అవుతున్నట్లు 'టెలిగ్రాం' యాప్ సృష్టికర్త పాల్ డురోవ్ చెబుతున్నారు.
వాట్సప్ వెర్షన్ వి2.11.471లో కూడా 'వాట్సప్ వెబ్' ప్రస్తావన ఉందని, అంతేకాకుండా కంప్యూటర్లలో లాగిన్ / లాగౌట్ అవ్వడం గురించి కూడా రాశారని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఫోన్లలో ఉన్న వాట్సప్లోకి లాగిన్ కావడం, అందులోంచి లాగౌట్ కావడం మాత్రం సాధ్యం కాదు. డెస్క్టాప్ వెర్షన్లో ఈ సదుపాయం కూడా కల్పించే ఆలోచనలో ఉన్నారట. దాంతోపాటు వినియోగదారుల స్టేటస్ను ట్రాక్ చేసేందుకూ ఏర్పాట్లున్నాయని పాల్ అంటున్నారు. ఇప్పటికే వైబర్, వీ చాట్, లైన్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్లు పూర్తిస్థాయి వెబ్, పీసీ వెర్షన్లను అభివృద్ధి చేశాయి. అందుకే వాట్సప్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇప్పటికే దాదాపు 60 కోట్ల మంది వినియోగదారులున్న వాట్సప్.. ఇక వెబ్ వెర్షన్ ప్రారంభిస్తే వీరి సంఖ్య మరింత పెరగడం మాత్రం గ్యారంటీ!!