ఏ దేశం ఎప్పుడు నిద్రలేస్తుంది ?
వాషింగ్టన్: ప్రపంచం ఎప్పుడు నిద్ర పోతుంది, ఎప్పుడు నిద్రలేస్తుంది? ప్రపంచంలోని ఏ దేశం ముందుగా నిద్ర పోతుంది, ఏ దేశం ముందుగా నిద్రలేస్తుంది ? ఏ రోజున ఏ దేశం బద్దకంగా ఒళ్లు విరుచుకుంటుంది, ఏ దేశం ఏ రోజున ఉత్సాహంగా ఉరకలేస్తుంది? మొత్తంగా ఏ దేశం ప్రశాంతంగా పడుకుంటుంది, ఏ దేశం నిద్ర కరవై కలతపడుతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా!... తమ వద్ద సమాధానాలు సిద్ధంగా ఉన్నాయని ‘స్లీప్ సైకిల్.కామ్’ నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్లీప్‌సైకిల్ యాప్‌ను ఉపయోగిస్తున్న ప్రజల్లో 58 దేశాల్లోని, 9,41,300 మంది యూజర్స్ డేటాను యాక్సిలోమీటర్ ద్వారా ట్రాక్‌చేసి వాటిని విశ్లేషించి నిపుణలు ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టారు.
ప్రపంచంలో ముందుగా నిద్రలేచే దేశం దక్షిణాఫ్రికా. ఆ దేశం సోమవారంనాడు ఉదయం 6.09 గంటలకు నిద్ర లేస్తుంది (సగటు లెక్కల ప్రకారం) మంగళవారం ప్రపంచం బద్ధకంగా నిద్ర లేస్తుంది. ఆ రోజున అమెరికా ప్రజలు సగటున ఉదయం ఏడు గంటలకు నిద్ర లేస్తారు. అన్ని రోజులకల్లా వారు ఆ రోజే పరమబద్ధకంగా ఉంటారట. కారణం ఆరోజు రాత్రి వారికి సరైన నిద్రలేకపోవడమే. మంగళవారం సరిగ్గా నిద్రపోని దేశాల్లో అమెరికా సరసన వరసగా సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలు నిలుస్తున్నాయి. అమెరికా సహా ప్రపంచ దేశాలన్ని బుధవారం రాత్రి ప్రశాంతంగా నిద్ర పోతున్నాయి. ఆ రోజున ప్రపంచదేశాలకన్నా చైనా ప్రజలు ఎక్కువ సేపు నిద్రపోతున్నారు. వారం రోజుల్లో సగటున ప్రశాంతంగా నిద్రపోతున్న దేశాల్లో స్లొవేకియా అగ్రస్థానంలో, చైనా రెండో స్థానంలో, భారత్ 25వ స్థానంలో, అమెరికా 48వ స్థానంలో ఉంది.
స్లొవేకియా సగటున 6.57 గంటలు నిద్రపోతుండగా, చైనా 6.43 గంటలు, భారత్ 6.35 గంటలు, అమెరికా 7.06 గంటలు నిద్రపోతోంది. (ఇక్కడ ప్రశాంతంగా నిద్ర పోవడమంటే రాత్రిళ్లు మధ్య మధ్యలో ఎక్కువ సార్లు లేవకపోవడం) గురువారం నాడు మధ్యప్రాచ్య దేశాలు ప్రశాంతంగా నిద్ర లేస్తూ ఆ రోజున హాయిగా గడుపుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఉల్లాసంగా గడుపుతున్నాయి. శుక్రవారం నాడు కోస్టరికా, కెనడా, న్యూజిలాండ్, స్వీడన్ దేశాలు ప్రశాంతంగా గడుపుతున్నాయి. మిగతా రోజుల్లో పోలిస్తే శనివారం నాడు 90 శాతం దేశాలు ఎక్కువ సేపు నిద్రపోతున్నాయి. 71 శాతం దేశాలు ఆ రోజున ఉల్లాసంగా ఉంటున్నాయట. ఇక ఆదివారం నాడు 66 దేశాలు చాలా తక్కువ సమయం ఆదివారం రాత్రి నిద్రపోతున్నాయి. సోమవారం నాడు ప్రపంచంలో ముందుగా నిద్రలేచే దక్షిణాఫ్రికా ఆదివారం రాత్రి సగటున 5.53 గంటలు మాత్రమే నిద్రపోతోంది.