ఇంటి పని చేయని మహిళకు జైలు శిక్ష!
ఇంటి పని సరిగా చేయడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీకి చెందిన మహిళ దోషిగా తేలితే గరిష్టంగా ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లాజియో రీజియన్లోని సోన్నినో ప్రాంతానికి చెందిన ఓ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో 40 ఏళ్ల సదరు మహిళపై కోర్టులో విచారించనున్నారు.
ఇంటిపనులు కూడా ఆమె సరిగా చేయకపోవడంతో కుటంబ కష్టాలు తీవ్రమయ్యాయని తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడంతో పరిశుభ్రతలేని ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని తెలిపాడు. ఆఖరికి ఆహారాన్ని కూడా ఎప్పుడో ఒకసారి వండుతుందన్నాడు. గత రెండేళ్లుగా ఇలానే కొనసాగుతుందని తెలిపాడు. వచ్చే అక్టోబర్లో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆమె దోషిగా తేలితే 2 నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది.
మరోవైపు, 2014, మార్చిలో గృహహింస నియంత్రించడానికి ఇంట్లో పని చేస్తున్న మహిళలకు కూడా జీతాలు ఇవ్వాలని ఇటలీలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే ఆ ప్రతిపాదనకు అన్ని వర్గాలనుంచి మద్దతు కరువైంది. ఇంట్లోనే మహిళలకు జీతాలిస్తే ఉద్యోగాల కోసం వేచిచూసే ధోరణి తగ్గుతుందని టరిన్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ప్రొఫెసర్ డానియల్ డెల్ బోకా తెలిపారు.