ఉగ్రవాదం అంతంతోనే అభివృద్ధి
అఫ్గాన్ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం
రూ. 600 కోట్లతో భారత్ నిర్మించిన పార్లమెంట్‌ను ప్రారంభించిన ప్రధాని
కాబూల్: సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినప్పుడే అఫ్గానిస్తాన్ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల వెంట ముష్కర తండాలన్నీ మూతపడ్డప్పుడే ప్రగతి కనిపిస్తుందని స్పష్టంచేశారు. భారత్.. అఫ్గాన్ బంగరు భవితకు పునాదులు వేస్తుందని తప్ప అగ్నికి ఆజ్యం పోయదన్నారు. రూ.600 కోట్లు వెచ్చించి భారత్ నిర్మించిన అఫ్గాన్ కొత్త పార్లమెంట్ భవనాన్ని దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో కలిసి శుక్రవారం మోదీ ప్రారంభించారు. పార్లమెంట్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(శుక్రవారం ఆయన 91వ పుట్టినరోజు) పేరిట నిర్మించిన ‘అటల్ బ్లాక్’నూ ప్రారంభించారు. అనంతరం పార్లమెంట్‌లో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్‌లో భారత్ జోక్యంపై పాక్ అభ్యంతరాల పరోక్షంగా ప్రస్తావించారు.
‘మేం ఇక్కడ ఉండడం కొందరికి నచ్చడం లేదు. వారికి భారత్-అఫ్గాన్ మైత్రి బలపడడం నచ్చక ఇబ్బంది పడుతున్నారు’ అని అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందంటూ సరిహద్దుల్లో పాక్ ముష్కరుల కార్యకలాపాలను ఎత్తిచూపారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా భారత్‌పై నమ్మకం పెట్టుకున్న అఫ్గాన్ ప్రజలకు శెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ‘మీరు మా నిజాయితీని, చిత్తశుద్ధిని ఏమాత్రం అనుమానించలేదు. చెప్పింది వినలేదు.. కళ్లారా చూసిందే నమ్మారు’ అని అన్నారు.
‘మీ త్యాగాలు వృథా కారాదు. మీ ఆశాజ్యోతి ఆరిపోవొద్దు. సంక్షుభిత పరిస్థితులు మళ్లీ వద్దు. అందరం కలిసి కష్టాలు, కన్నీళ్లకు చోటులేని కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుందాం. మీ దేశ భవిష్యత్తు నిర్మాణంలో సాయపడతాం’ అని ఉద్ఘాటించారు. అఫ్గాన్, దక్షిణాసియాను అనుసంధానించే వారధిలా పాకిస్తాన్ ఉండాలన్నారు. కాబూలీవాలా మరోసారి భారత ప్రజల మనసు గెల్చుకోవడానికి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
500 మందికి ఉపకార వేతనాలు
అఫ్గాన్ ఆర్మీలో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాలకు భారత్ స్నేహహస్తం చాచింది. ఆ కుటుంబాలకు చెందిన 500 మంది పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందిస్తామని మోదీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు భద్రత అంశాలపై వారిరువురు మోదీ.. ఘనీతో చర్చించారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) అబ్దుల్లా అబ్దుల్లాతో కూడా మోదీ భేటీ అయ్యారు. మోదీ రష్యా నుంచి శుక్రవారం వేకువజామునే కాబూల్‌కు చేరుకున్నారు.