వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తన పదవికి రాజీనామా చేశారు. పదవీ కాలానికి మూడేళ్లు ముందే ఆయన వైదొలగడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మౌలిక రంగంలోని సంస్థలో అవకాశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచ సంస్థకు అధ్యక్షుడిగా ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, పేదరికం నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినట్లు జిమ్ యాంగ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతున్న దశలో ప్రపంచ బ్యాంక్ సేవలు ఎంతో అవసరమని ఆయన అన్నారు.
కిమ్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా 2012లో తొలిసారి బాధ్యతలు స్వీరించారు. 2017లో రెండోసారి ఎన్నికై కిమ్ పదవీ కాలం 2022 వరకు ఉంది. అంతర్జాతీయంగా పేదరిక నిర్మూలనకు అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. 2012లో తొలిసారి ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా నియమితులైనప్పుడు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు నిర్దేశించారు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత సీఈవో క్రిస్టాలినా జార్జియేవా ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాధ్యతలను స్వీకరించనున్నట్లు సమాచారం. 59 ఏళ్ల కిమ్ దక్షిణ కొరియా దేశానికి చెందినవారు.
Comments
Please login to add a commentAdd a comment