బుధవారం ఖమ్మంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం క్రైం: ప్రజాక్షేత్రంలోకి వచ్చాక భౌతిక దాడులు, రాజకీయ విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసేన ప్రత్యక్షమవుతుందని, తాను తెలంగాణ బాగు కోరితే తప్పేంటని నిలదీశారు. సినిమాల్లో ఉంటే అందరూ పొగుడుతున్నారని, రాజకీయాల్లో మాత్రం తన ఎదుగుదలను ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.
బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లా కార్యకర్తల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంగా ఎదిగి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటే అన్ని కులాలు, మతాల మద్దతు అవసరమని.. ఆ మద్దతు కూడగట్టేందుకే ప్రజాయాత్రకు శ్రీకారం చుట్టానని తెలిపారు. మన యాస, భాషతోపాటు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించినపుడే జై తెలంగాణ నినాదానికి అర్థం ఉంటుందన్నారు. జై తెలంగాణ అంటూ సామాజిక మార్పు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు.
మార్పు కోసమే..
దేశ రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, ప్రతి కార్యకర్త దీన్ని గుర్తించాలని పవన్ చెప్పారు. సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన కార్యకర్త ప్రత్యక్షమవ్వాలని, వాటిని పరిష్కరించేందుకు ముందుండాలని పిలుపునిచ్చారు. 2019లో అధికారంలోకి వస్తామని చెప్పడం లేదని.. కానీ కనీస మార్పుకు ఆ ఎన్నికలు నాంది కావాలన్నారు. శ్రీకాకుళంలో ఉన్నట్లే తెలంగాణలోని నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఉందని, దాన్ని అంతమొందించే వరకు కృషి చేస్తామని ప్రతినబూనారు.
వారికేం ఇబ్బందో..
రాజకీయాల్లో విమర్శలు సహజమని, సహేతుక విమర్శలు స్వీకరించేందుకు తాను సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. కానీ అవగాహన ఉన్న కాంగ్రెస్ నేతలూ తనపై విరుచుకుపడటం ఆశ్చర్యంగా ఉందని.. తన రాజకీయ విధానాలు ప్రచారం చేసుకుంటే ఇతర పార్టీలకు ఏం ఇబ్బందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మాజీ ఎంపీ హనుమంతరావును ఆ పార్టీ తరఫున తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన మద్దతిస్తుందని వెల్లడించారు. వీహెచ్ వంటి నేత తనతో కలిసొస్తే ఇంటింటికీ తిరిగి సమస్యలేంటో తెలుసుకుందామన్నారు.
చెప్పు విసిరిన అగంతకుడు
పవన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఓ అగంతకుడు చెప్పు విసిరాడు. కొత్తగూడెం నుంచి ఖమ్మంకు ఓపెన్‌టాప్ కారులో వస్తుండగా.. తల్లాడ ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన పవన్ వ్యక్తిగత సిబ్బంది ఆయనకు రక్షణ వలయంగా నిలిచారు. చెప్పు ఎవరు విసిరింది తెలియలేదు. కాగా, కొత్తగూడెం నుంచి ఖమ్మం వస్తు న్న సమయంలో వాహన శ్రేణిలోని ఓ వాహనం ఢీకొని ఓ వ్యక్తి కాలు విరిగింది. అతడిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పవన్ కాన్వాయ్‌లో ని ఓ కారు.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఖమ్మం రూరల్ ఎస్‌ఐ చిరంజీవి కాలిపైకి ఎక్కడంతో గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment