అధికారం ‘బరి’తెగిస్తోంది.. సమస్యలపై నోరు విప్పడం తప్పుఅవుతోంది.. ప్రశ్నిస్తే దాడికి పాల్పడుతున్నారు.. ఊరురా అర్జీలు అందించాలని ప్రచారం చేస్తున్న అధికారులు చేష్టలుడికి చూస్తున్నారు.. జన్మభూమి కమిటీ సభ్యులు రెచ్చిపోతుండగా ప్రజాప్రతినిధులు అండగా ఉంటున్నారు. అందుకు జన్మభూమి సభలు వేదికలయ్యాయి.
మచిలీపట్నంటౌన్ : పట్టణంలోని 29వ వార్డులో సోమవారం నిర్వహించిన జన్మభూమి సభ రసాభాసగా మారింది. ఆ వార్డు జన్మభూమి కమిటీ సభ్యులు వీరంగం సృష్టించారు. వార్డు కౌన్సిలర్‌గా ప్రాతి నిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీర్‌అస్గర్‌అలీతో పాటు కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, కోసూరి లక్ష్మీనాంచారయ్య, పార్టీ నాయకుడు ధనికొండ శ్రీనివాస్‌లపై దౌర్జన్యానికి దిగారు. చొక్కా కాలర్లు పట్టుకుని దాడి చేసేందుకు యత్నించారు. సభలో ఉన్న మునిసిపల్ చైర్మన్ ఎంవీ బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం కూడా వారికి మద్దతుగా నిలవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
గొడవ ప్రారంభమైంది ఇలా
మీ వార్డులో పింఛన్లు అందని వారు ఎవరైనా ఉన్నారా అని చైర్మన్ బాబాప్రసాద్ ప్రశ్నించారు. దీంతో ఆ వార్డుకు చెందిన గట్టా కనకదుర్గ ఆయన వద్దకు వచ్చి చేతులు జోడించి దండం పెట్టి ‘అయ్యా నా భర్త తాతయ్య మృతి చెంది నాలుగు సంవత్సరాలైంది.. అప్పటి నుంచి వితంతు పింఛను కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నా’ అని సభ దృష్టికి తీసుకొచ్చారు. చూస్తా.. వెళ్లి కూర్చో అంటూ చైర్మన్ ఆమెను పంపే ప్రయత్నం చేశారు. ఈ దశలో పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తున్న కొంత మంది దరఖాస్తుదారులు ఆయన వద్దకు వెళ్లారు. నాలుగేళ్లుగా కనకదుర్గకు పింఛను రాకపోతే ఏం చేస్తున్నావంటూ అవార్డు కౌన్సిలర్ అస్గర్‌ను వైస్‌చైర్మన్ కాశీవిశ్వనాథం ప్రశ్నించారు.
దీంతో అస్గర్ లేచి వీరందరూ పింఛను పొందేందుకు అర్హులేనని వీరికి పింఛను మంజూరు చేయాలంటూ పలుమార్లు కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించానని, జన్మభూమి సభల్లో అడిగినా మంజూరు కాలేదన్నారు. ఈ దశలోనే ఆ వార్డు జన్మభూమి కమిటీ సభ్యులు అస్గర్‌తో పాటు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు. చొక్కా కాలర్‌ను పట్టుకున్నారు. కౌన్సిలర్ అస్గర్ మాట్లాడతూ వార్డులో 72 మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయటం లేదని అదేమని అడిగితే సభలో రాజకీయం చేయవద్దని చైర్మన్ వారించే ప్రయత్నం చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని నిలదీశారు.
సభలో మునిసిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, కమిషనర్ ఎం.జస్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రిక, డీఈ వెంకటేశ్వరగుప్తా ఉన్నారు. పట్టణంలోని 30, 31, 32, 33 వార్డుల్లో కూడా జన్మభూమి సభలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment