కన్నీళ్లకే కన్నీరొచ్చే.. కష్టాలకే కష్టం వేసే..! | old couple suffering with handicapped daughter and son | Sakshi
Sakshi News home page

కన్నీళ్లకే కన్నీరొచ్చే.. కష్టాలకే కష్టం వేసే..!

Published Wed, Feb 7 2018 10:05 AM | Last Updated on Wed, Feb 7 2018 10:05 AM

old couple suffering with handicapped daughter and son - Sakshi

కర్ర సాయం లేనిదే నిలబడలేని వెంకయ్య

కోడూరు మండలం లింగారెడ్డిపాలెం దళితవాడకు చెందిన నాగేసు, రజనీరాణి దంపతుల దుస్థితిని చూస్తే కన్నీళ్లకే కన్నీరొస్తుంది. కష్టాలకే కష్టం వేస్తుంది. ఆ దంపతులది 65 ఏళ్లు పైబడిన వయసు. మంచానికే పరిమితమైన కుమార్తె. కర్రసాయమైనా లేనిదే నిలబడలేని కుమారుడు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. వృద్ధాప్యంలో బిడ్డలే లోకంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రులను చూస్తే ఎవరైనా అయ్యోపాపం ఎంత కష్టం అంటూ జాలిపడతారు. ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లు మంజూరుచేసి తల్లిదండ్రులకు అండగా నిలిచింది. అయితే ఆ పింఛన్లు ఇవ్వాల్సిన అధికారుల మనసు మాత్రం కఠినంగా మారింది. పింఛన్‌ డబ్బులు కావాలంటే మండలకేంద్రమైన కోడూరుకు రావాల్సిందేనంటూ భీష్మించారు. చేసేదేమీలేక ఆ వృద్ధదంపతులు పిల్లలిద్దరినీ చక్రాల కుర్చీలపై కూర్చోబెట్టి ఆరు కిలోమీటర్ల దూరం నెట్టుకెళ్లి, తిరిగా రావాల్సి వస్తోంది.

కోడూరు(అవనిగడ్డ): మండలంలోని లింగారెడ్డిపాలెం దళితవాడకు చెందిన 68 ఏళ్ల నాగేసు, 64 ఏళ్ల రజనీరాణి దంపతులు. వారికి 34ఏళ్ల కుమారుడు వెంకయ్య, 30 ఏళ్ల కుమార్తె ఆశాజ్వోతి ఉన్నారు. ఇద్దరికీ చిన్నప్పుడే పోలియో సోకడంతో ఆశాజ్వోతి మంచానికే పరిమితమైంది. బయటకు వెళ్లాలంటే ఎత్తుకుని తీసుకెళ్లాలి. వెంకయ్య కర్రసాయం లేనిదే లేచి నిలబడలేని పరిస్థితి. వారిద్దరికీ దివ్యాంగ పింఛన్‌ వస్తోంది. తండ్రి నాగేసు పొలాల్లో కాపలా ఉంటూ రైతులు ఇచ్చే ధాన్యంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆశాజ్యోతి చేతివేలి ముద్రలు సరిగా పడక పోవడంతో నాగేసు వేలిముద్రలను ఆమె పింఛన్‌కు లింకు చేశారు. కదలలేని పరిస్థితిలో ఉన్న ఆశాజ్యోతి, వెంకయ్యకు ఇంటికొచ్చి పింఛన్‌ ఇవ్వాల్సి ఉంది. మందపాకలలో ఉన్న బ్యాంకు కరస్పాండెంట్‌ వారికి పింఛన్‌ ఇస్తుంటారు.

అయితే ఇంటికొచ్చి ఇవ్వకుండా, ప్రతినెలా మందపాకలకు రమ్మనడంతో కదలలేని కుమార్తె, నడవలేని కుమారుడిని వృద్ధ తల్లిదండ్రులు చక్రాల బండిలో రెండున్నర్ర కిలో మీటర్ల దూరం ఉన్న మందపాకలకు తీసుకెళ్తున్నారు. అక్కడా వేలిముద్రలు పడకపోతే మండల కేంద్రమైన కోడూరు ఎస్‌బీఐ బ్యాంకుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. గత నెలలో ఇలాగే గ్రామం నుంచి మందపాకల, అక్కడ నుంచి కోడూరుకు ఐదున్నర్ర కిలోమీటర్లు దూరం చక్రాల బండిలో బ్యాంకు తీసుకెళ్లి వేలిముద్రలు వేసిన తరువాతనే అధికారులు పింఛన్‌ ఇచ్చారు. సోమవారం వీరిద్దరినీ మందపాకలకు తీసుకెళ్లగా, మళ్లీ కోడూరు వెళ్లాలని చెప్పడంతో వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. తమ పిల్లలను చక్రాల బండిలో తీసుకెళ్లాలంటే ప్రాణం పోతోందని వాపోతున్నారు. ఆశాజ్యోతి నోటి నుంచి సొంగపడుతుందంటూ ఆటో డ్రైవర్లు ఎక్కించుకోవడంలేదని చేసేదేమీలేక చక్రాల కుర్చీల్లో తీసుకెళ్లాల్సి వస్తోందని వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి ఇంటికొచ్చి వచ్చి పింఛన్‌ ఇచ్చేలా కనికరించండి సారూ అంటూ వారు వేడుకొంటున్నారు. దివ్యాం గులు ఆశాజ్యోతి, వెంకయ్య పింఛను కోసం వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై ఎంపీడీఓ బి.వెంకటేశ్వరరెడ్డిని వివరణ కోరగా తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. పింఛన్‌ కరస్పాండెంట్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని  చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement