రామచంద్రపురం (పటాన్‌చెరు): రామచంద్రపురం మండల పరిధిలోని బండ్లగూడ గ్రామ శివారులో టైర్ల గోదాంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారు. వివరాల్లోకి వెళ్తే... బండ్లగూడ గ్రామంలో అగర్వాల్ రబ్బర్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో టైర్లు తయారవుతాయి. టైర్లను పెట్టేందుకు కొన్ని నెలల క్రితం యాజమాన్యం అదే గ్రామంలో పరిశ్రమకు రెండు కిలోమీటర్ల దూరంలో మూతపడిన పరిశ్రమ గోదామును అద్దెకు తీసుకుంది. తయారైన టైర్లను ఆ గోదాములో నిల్వ చేసి అక్కడి నుంచి పంపిణీ చేస్తారు. ఆ గోదాములో సుమారు 2 లక్షల టైర్లను ఉంచినట్టు అనధికారికంగా తెలిసింది.
గురువారం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెల్లిపోయారు. వాచ్‌మెన్ ఒక్కడే ఉన్నాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గోదాములో మంటలు చెలరేగడంతో వాచ్‌మెన్ అప్రమత్తమై యాజమాన్యానికి సమాచారం అందించాడు. పటాన్‌చెరువులోని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి వచ్చి 8 గంటల వరకు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రబ్బర్ కావడంతో ఆర్పేసిన మంటలు అదుపులోకి రావడానికి ఎక్కువ సమయం పట్టింది. మంటల కారణంగా గోదాము రేకులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. మంటలు ఆర్పేందుకు గోదాము గోడలను కూల్చారు. కార్మికులు వచ్చి గోదాములోని చాలా వరకు టైర్లను బయట వేశారు. ఈ గోదాములో పెద్ద ఎత్తున టైర్లను పెట్టడానికి అనుమతి ఉందా? లేదా? అని పలువురు చర్చించుకుంటున్నారు.
టైర్లు అంటుకొని పెద్ద ఎత్తున పొగ రావడంతో గ్రామస్తులు ఇబ్బంది పడ్డారు. పొగ కారణంగా శ్వాస తీర్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ గోదాముకు ఆనుకొని రెండు గోదాలు, సమీపంలో కెమికల్ పరిశ్రమలు కూడా ఉండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఒకవేళ మంటలు కెమికల్ పరిశ్రమ వరకు వ్యాపించి ఉంటే ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం పెద్ద ఎత్తున ఉండేదని గ్రామస్తులు తెలిపారు. టైర్లను గోదాములో పెట్టినప్పుడు యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా సుమారు రూ.25 కోట్లు ఆస్తినష్టం జరిగిందని చెప్పుకుంటున్నారు. సాయంత్రం వరకు యాజమాన్యం అధికారికంగా ఎంత ఆస్తినష్టం జరిగిందో ప్రకటించ లేదు. రామచంద్రపురం ఇన్‌స్పెక్టర్ రామచందర్‌రావును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఆరు ఫైర్ ఇంజన్లతో..
గోదాములో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమించారు. అగ్నిమాపక అధికారి ధన్యానాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది 8 గంటలు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఒకవేళ మంటలు అదుపులోకి రాకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరిగేదన్నారు. ఆరు ఫైర్‌ఇంజన్లు మంటలను ఆర్పాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి ఫైర్‌ఇంజన్‌లో నింపాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు గోదాము నుంచి పొగలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment