సీనియర్ నరేశ్
‘మా’ నూతన అధ్యక్షుడు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. సీనియర్ నరేశ్ మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికోసం సీనియర్ నరేశ్, శివాజీరాజా ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా నరేశ్ విజయం సాధించారు. ‘మా’ అసోసియేషన్‌లో దాదాపు 800 ఓట్లు ఉండగా 472 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి పోలింగ్‌కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. నరేశ్‌కు 268 ఓట్లు పోల్ కాగా, శివాజీ రాజాకు 199 ఓట్లు వచ్చాయి.
దీంతో 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ‘మా’ ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీగాలుగా గౌతమ్‌రాజు, శివబాలాజీ, కోశాధికారిగా రాజీవ్ కనకాల విజయం సాధించారు. కాగా హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందడం విశేషం. ‘మా’ ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) సభ్యులుగా అలీ, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేశ్ కొండేటి, అనితా చౌదరి, అశోక్ కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment