కపిల్‌కు ఎయిరిండియా హెచ్చరిక
విమాన ప్రయాణంలో అనుచితంగా ప్రవర్తించేవాళ్లపై భారత విమానయాన సంస్థలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి. వాళ్లు ఎంత వీవీఐపీలు అయినా, సెలబ్రిటీలు అయినా కూడా లెక్క చేయడం లేదు. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వస్తున్న ఓ విమానంలో టాప్ టీవీ కమెడియన్ కపిల్ శర్మ చేసిన హడావుడిని చూసి.. అతడికి హెచ్చరికలు పంపాలని నిర్ణయించింది. అసలు ఆ విమానంలో ఏమైందన్న విషయం గురించి ఎయిరిండియా చీఫ్ అశ్వనీ లొహానీ విచారణ మొదలుపెట్టారు. కపిల్‌కు ఎలాంటి హెచ్చరిక పంపాలో దాన్ని బట్టి నిర్ణయిస్తారు.
మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో కపిల్ శర్మ తన బృందంతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారు. అతడు బాగా మద్యం తాగి గట్టిగా మాట్లాడుతూ, తన బృందంతో కలిసి నానా హడావుడి చేసినట్లు సమాచారం. దీనివల్ల తోటి ప్రయాణికులు బాగా ఇబ్బంది పడటంతో పాటు కొంతమంది భయపడ్డారు కూడా. కేబిన్ సిబ్బంది అతడిని కలిసి కాస్త ఊరుకొమ్మని చెప్పారు. ప్రయాణికుల్లో పెద్దవయసు వాళ్లు కూడా ఉండటంతో ఇలా చేయడం సరికాదన్నారు. దాంతో కపిల్ శర్మ సిబ్బందికి సారీ చెప్పి మాట్లాడకుండా ఉన్నాడని అంటున్నారు. కాసేపటి తర్వాత మళ్లీ తన ట్రూప్ సభ్యుల మీద అరవడం మొదలుపెట్టాడని, ఈసారి పైలట్ వచ్చి గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత చాలా సేపటి వరకు కపిల్ నిద్రపోతూనే ఉన్నాడని విమానంలో ప్రయాణించినవారిలో ఒకరు చెప్పారు.