ప్రేమ ఉన్న చోట ఒత్తిడి ఉంటుంది!
‘‘నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, భర్తగా, నాన్నగా లైఫ్ ఎలా ఉంది? త్వరలోనే మావయ్య కూడా కాబోతున్నారు’’ అనడిగితే... ‘‘నెక్ట్స్ ఏంటి? తాతయ్య అంటారా!’’ అని నవ్వేశారు నాగార్జున. ఎప్పుడూ హ్యాండ్‌సమ్‌గా, హ్యాపీగా కనిపించే నాగ్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. నాగార్జున చెప్పిన విశేషాలు...
► బర్త్‌డేకి ఏం ప్లాన్ చేయలేదు. ఇప్పుడు పిల్లలొచ్చారు కదా! వాళ్లకు అప్పజెప్పా, చూసుకుంటున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా హ్యాపీ. చైతూ (నాగచైతన్య) హీరోగా మా బేనర్లో నిర్మించిన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ మంచి హిట్టయింది. త్వరలో వాడి పెళ్లి. అలాగే, అఖిల్ హీరోగా నిర్మిస్తున్న ‘హలో’ బాగా వస్తోంది. నేను హీరోగా నటించిన ‘రాజుగారి గది–2’ బాగా వచ్చింది. అభిమానులు, మేమూ అందరూ హ్యాపీ.
► ‘రాజుగారి గది–2’లో నేను ‘మెంటలిస్ట్’ క్యారెక్టర్ చేస్తున్నా. రియల్ లైఫ్‌లో అలాంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గుర్ని కలిశా. వాళ్లకు అబ్జర్వేషన్ పవర్స్ ఎక్కువ. మిర్రర్ మెమరీ ఉంటుంది. అంటే... 20 ఏళ్ల క్రితం జరిగిన అంశాలు వాళ్లకు గుర్తుంటాయి. ఈ పాత్రలో నటించడం కొత్తగా ఉంది. మలయాళ ‘ప్రేతమ్’ స్ఫూర్తితో ఈ సిన్మా తీశాం. బట్, సేమ్ టు సేమ్ తీయలేదు. ఇందులో సమంత దెయ్యంగా నటించింది. ఆత్మగానూ కనిపిస్తుంది. మా మధ్య ఉండే డ్రామాయే సినిమా.
► ‘రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా దెయ్యాలు ఎదురయ్యాయా?’ అనడిగితే... ‘‘ఊహించుకోవడమే. చిన్నప్పుడు ఏదో సౌండ్ వినపడిందని నిద్ర పట్టకపోతే... రూమ్‌లో దెయ్యం ఉందనేవారు. అబద్ధమో.. నిజమో.. ఎవరికి తెలుసు? వ్యక్తిగతంగా నేను నమ్మేది ఏంటంటే... దేవుడున్నాడంటే? దెయ్యాలు ఉన్నట్టే కదా!’’ అన్నారు.
► చిన్నప్పుడు హారర్ ఫిల్మ్స్‌ను రెండు చెవులు మూసుకుని భయపడుతూ చూసేవాణ్ణి. (నవ్వుతూ..) ఇప్పుడూ కొన్నిసార్లు అలానే చూస్తా. షూటింగ్ చేసేటప్పుడు అంతేమీ ఉండదు. నాకెప్పుడూ లైటర్‌వీన్ హారర్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. మరీ ఎక్కువ హారర్ అంటే కష్టం.
► ఓంకార్ మిస్టర్ పర్‌ఫెక్ట్. అనుకున్నది అనుకున్నట్టుగా కరెక్టుగా తీస్తాడు. వెరీ క్లియర్. అప్పుడు నటీనటులకు సులభమవుతుంది. ఈ సినిమాలో నా పాత్రకు డబ్బింగ్ చెప్పేశా. రీ–రికార్డింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ 10కి ఫస్ట్ కాపీ వస్తుంది. ఇదొక హారర్ కామెడీ థ్రిల్లర్. నా కామెడీ తక్కువ... ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, అశ్విన్‌లది ఎక్కువ. బేసిక్‌గా సిట్యువేషనల్ కామెడీ ఉంటుంది.
► నెక్ట్స్ సిన్మా ఏంటనేది ఇంకా ఆలోచించుకోలేదు. ‘బంగార్రాజు’ కోసమని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కొన్ని లైన్స్ చెప్పాడు. పక్కా సీక్వెల్ (‘సోగ్గాడే చిన్ని నాయనా’కి) కదా! కథ బాగుండాలి. లేదంటే చేయకూడదు. తమిళ హిట్ ‘విక్రమ్‌వేద’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారట? అనడిగితే... ‘‘నేనింకా ఆ సిన్మా చూడలేదు. చేయమని అడిగారు. చూడాలి’’ అన్నారు.
చైతూ పెళ్లికి నేనూ అతిథినే!
చైతూ పెళ్లికి నేనూ అతిథినే. అంతా వాళ్లే చూసుకుంటామని చెప్పారు. (నవ్వుతూ...) చెక్ మీద సంతకం మాత్రం పెట్టమన్నారు. అక్టోబర్ 6న గోవాలో హిందూ–క్రిస్టియన్ సంప్రదాయల ప్రకారం పెళ్లి జరుగుతుంది. పెళ్లి వేడుక చిన్నగా చేసుకుంటామన్నారు. ఆ తర్వాత రిసెప్షన్ ఎలా చేయాలనేది నేను ప్లాన్ చేయాలి.
ఆవకాయ్...అభిమానమ్!
ఏదైనా బాగోలేదని అనుకుంటున్నప్పుడు అభిమానుల నుంచి ఫోన్స్ వస్తాయి. మాట్లాడితే... అంతా సెట్ రైట్ అవుతుంది. టెలిపతీతో తెలుసుకుంటారో? మరొకటో? నాకు తెలీదు. కొంతమందిని కలుస్తుంటాను. ఏజ్డ్ ఫ్యాన్స్. నాన్నగారి దగ్గర్నుంచి, నా చిన్నప్పట్నుంచి తెలుసు. ప్రతి ఏడాది నాన్నగారికి ఎన్నో రకాల ఆవకాయ పచ్చళ్లు వస్తాయని నాకు తెలీదు. నాన్నగారు లేరు కదా! ఇప్పుడవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో పచ్చళ్లు, సీట్స్ రకరకాలు వస్తున్నాయి. తెలుగు యాక్టర్స్‌కు అదొక వరం! నేనెప్పుడూ అభిమానులకు రుణపడి ఉంటాను. నాన్నగారి (ఏయన్నార్) పేరు మీద ఇచ్చే ‘ఏయన్నార్ జాతీయ అవార్డు’ల గురించి మరో వారంలో ప్రెస్‌మీట్ పెట్టి చెబుతా.
హలో... నేనే చెప్పా!
ప్రేమించిన అమ్మాయి దగ్గర్నుంచి ‘హలో’ అనే ఒక్క పదం కోసం వెయిట్ చేసే ఓ అబ్బాయి కథే అఖిల్ సిన్మా. ఆర్నెల్ల నుంచి టైటిల్ ఏంటని ఆలోచిస్తున్నారు. సాధారణంగా నాకు మంచి ఆలోచనలన్నీ ఉదయం ఆరు నుంచి ఆరున్నర లోపు వస్తాయి! ఎందుకంటే... మంచిగా వర్కౌట్స్ చేసి కూర్చుంటాం. మైండ్ ఫ్రెష్‌గా వర్క్ చేస్తుంది. సడన్‌గా ఓ రోజు ‘హలో’ బాగుంటుందనే ఐడియా వచ్చింది. సుప్రియకు ఫోన్ చేసి ‘హలో’ టైటిల్ రిజిస్టర్ చేయించమని చెప్పా. ఇందులో హీరోయిన్ కోసం... ‘గీతాంజలి’లో గిరిజలా, ‘ఏమాయ చేసావే’లో సమంతలా కొత్తగా ఉండే అమ్మాయి కోసం వెతికి, వెతికి చివరకు దర్శకుడు ప్రియదర్శన్‌గారమ్మాయి (కల్యాణీ)ని ఎంపిక చేశాం.
ఎన్టీఆర్ టు ఎన్టీఆర్!
టైటిల్ ఎనౌన్స్ చేసే వీడియోలో రామారావుగారితో (సీనియర్ ఎన్టీఆర్) స్టార్ట్ చేయించి, నాన్నతో ఫినిష్ చేయించి ‘హలో’ టైటిల్ ప్రకటిద్దామనుకున్నాం. టైమ్‌కి పెద్దాయన క్లిప్ దొరకలేదు. అందుకని, తారక్‌ను (చిన్న ఎన్టీఆర్) అడిగాం. తను, అఖిల్ మంచి ఫ్రెండ్స్.
లీకులు స్ట్రాటజీ కాదు!
‘హలో’ పోస్టర్ డిజైనింగ్ కోసమని హాంకాంగ్‌లో ఉన్న ఫ్రెండ్‌కి విక్రమ్ కుమార్ స్టిల్ పంపించాడు. ‘మనం’కూ అతనే పోస్టర్స్ డిజైన్ చేశాడు. అక్కడతను వాళ్ల గాళ్‌ఫ్రెండ్‌కో, ఎవరికో ఫేస్ బుక్‌లో పెట్టాడు. అక్కణ్ణుంచి స్టిల్ బయటకొచ్చింది. ఏదో స్ట్రాటజీతో మేం లీక్ చేయలేదు. అప్పటికి టైటిల్ లోగో కూడా అనుకోలేదు. లక్కీగా రెండు మూడు పోస్టర్లు చేయడంతో నెక్ట్స్ మంచిది విడుదల చేశాం. ‘‘ఇప్పుడీ ‘హలో’, మొన్న ‘రారండోయ్.. వేడుక చూద్దాం!’లకు మీరే నిర్మాత. మీ అబ్బాయిల సిన్మాలనే ఒత్తిడి ఏమైనా ఉందా?’’ అనడిగితే... ‘‘ఉంటుంది కదా! ప్రేమ ఉంటుంది కదా! అది ఉంటే ఒత్తిడి వస్తుంది’’ అన్నారు.