ఇవన్నీ నా ప్లస్ పాయింట్లే!
‘‘‘అనామిక’లో నటించడం నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి’’ అన్నారు అందాలతార నయనతార. నచ్చిన పాత్రలను ఎంచుకొని చేయడం వల్లే తన పనితీరులో నాణ్యత కనబడుతోందని ఆమె చెప్పారు. తమిళంలో ఆమె ‘రాజా-రాణి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు కాంచిపురంలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
ఈ సందర్భంగా నయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ -‘‘నలుగురిలో ఒకరిగా ఉండటం చిన్నప్పట్నుంచీ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయత్నించేదాన్ని. నన్ను ఈ రోజు ఈ స్థాయికి తెచ్చింది ఆ గుణమే. కథానాయికను అయ్యాక కూడా సాటి హీరోయిన్లకు భిన్నంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటా. అన్ని భాషల చిత్రాలూ చూస్తా. ఆయా సినిమాల్లో కథానాయికల నటనను పరిశీలిస్తా.
వారికి భిన్నంగా నటించాలని తపిస్తా. ఇవన్నీ నాలోని ప్లస్ పాయింట్స్. నా కెరీర్‌లో కొన్ని ఊహించని పరిణామాలు ఎదురైనా... ఇప్పుడు మాత్రం నాకు నటన తప్ప వేరే ఆలోచన ఉండటం లేదు. అదే నాకు చక్కని ఫలితాన్నిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ‘అనామిక’ చేస్తున్నాను.
నటిగా నాకది ఛాలెంజింగ్ రోల్. నేను ‘కహాని’ సినిమా చూడలేదు. ఈ సినిమా ‘ఓకే’ చేశాక కూడా చూడలేదు. ‘అనామిక’ పూర్తయ్యే వరకూ చూడను కూడా. చూడకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ఒకరి ప్రభావం నాపై పడటం నాకు ఇష్టం ఉండదు’’ అని చెప్పారు నయన.