
తాతను మురిపిస్తున్న గడుగ్గాయి
ముంబై: మూడేళ్ళ ఆ గడుగ్గాయి వయసుకు మించిన తెలివితేటలతో 72 ఏళ్ల తాతను తెగ మురిపిస్తోందట. తన ముద్దు ముద్దు మాటలతో ..అదేంటి.. ఇదేంటి.. అంటూ తెగ ప్రశ్నలు కురిపిస్తోందట. ఇంతకీ ఎవరా గడుగ్గాయి ..ఎవరా తాత అనుకుంటున్నారా.. అదేనండి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన మనవరాలు ఆరాధ్య బచ్చన్..
ఎపుడూ షూటింగులతో బిజీబిజీగా ఉండే అమితాబ్, మనవరాలు ఆరాధ్య కబుర్లతో, కథలతో మురిసిపోతూ, తన ఆనందాన్ని ప్రకటిస్తూ బ్లాగ్ లో కమెంట్స్ పోస్ట్ చేశారు. 'మా బుజ్జి ఆరాధ్య నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది... ఇంటితో పాటు, తన స్నేహితులు, బొమ్మలమీద వింత వింత కథలు చెబుతూ మాట్లాడుతుందంటూ' అమితాబ్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. పెద్ద ఆరిందాలా చమత్కారంగా మాట్లాడుతోంటే.. భలే ముచ్చటగా ఉంది.. తనతో సమయం గడపటం చాలా సంతోషంగా ఉందన్నారు అమితాబ్. ఈ దుష్ట ప్రపంచంలోకి అడుగిడబోతున్న చిన్నారుల జీవితాల్లో సంతోషం నిండిన రోజులివే కదా..అంటూ తన బ్లాగ్లో పేర్కొన్నారు.
కాగా బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, అందాల తార ఐశ్యర్యరాయ్ ల ముద్దుల పట్టి ఆరాధ్య. 2011లో ఈ బాలీవుడ్ తారలకు ఆరాధ్య పుట్టింది.