
అనన్య పాండే
బాలీవుడ్‌లోకి మరో యువకథాయిక ఎంట్రీ ఇవ్వబోతోంది. అలనాటి హీరో చుంకీ పాండే పెద్ద కూతురు అనన్య పాండే సినీ అరంగేట్రం మొదలవనుంది. వస్తూ వస్తూనే యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ఛాన్స్ కొట్టేసిందన్న వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కరణ్ జోహార్ నిర్మాతగా పునిత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కెనున్న ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ సినిమాతో 19 ఏళ్ల అనన్య పాండే బాలీవుడ్‌కు పరిచయం కానున్నారని తెలుస్తోంది.
ఆమె పుట్టుకతోనే నటి..
అనన్య టైగర్ ష్రాఫ్ పక్కన నటించనున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె తండ్రి చుంకీ పాండే సమాధానం దాటవేశారు. ‘నా కూతురు పుట్టుకతోనే నటి. ఆమె నటిగా జీవించడానికే పుట్టింది’ అంటూ చమత్కరించారు. సినిమాల్లో రాణించేందుకు ఆమె నటనలో శిక్షణ తీసుకుందని చుంకీ తెలిపారు. టైగర్ ష్రాఫ్ అద్భుతమైన నటుడని కితాబిచ్చారు. భాగీ-2 సినిమాలో అతని నటన అదిరిపోయిందంటూ టైగర్‌ని ప్రశంసించారు. అనన్య గతేడాది పారిస్‌లోని ‘లే బాల్ దేస్ డిబ్యూటాంటిస్’ ఫ్యాషన్ షోలో పాల్గొని తన అందంతో ఆకట్టుకుంది.