ట్రంప్ మాటలకు హర్టయిన హీరోయిన్
లండన్: అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తీరును హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ విమర్శించింది. ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జోలీ తప్పుపడుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. శరణార్థులకు ఐక్యరాజ్య సమితి దూతగా ఉన్న జోలీ బీబీసీ నిర్వహించిన కార్యక్రమంలో శరణార్థులతో మాట్లాడింది.
అమెరికాలోకి ముస్లింలను అనుమతించరాదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించమని ఓ వ్యక్తి కోరగా.. జోలీ కళ్లు మూసుకుని, నిరసనగా తల అడ్డంగా ఊపింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు వినాల్సిరావడం చాలి కష్టంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వలసదారులందరితో కలసి అమెరికా నిర్మితమైంది. మతం, ప్రాంతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించేందుకు అమెరికా వచ్చారు. ట్రంప్ అభిప్రాయం అమెరికాపై నాకున్న విజన్కు విరుద్ధమైనది' అని జోలీ చెప్పింది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 130 మంది మరణించిన అనంతరం ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని అన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడిన అభ్యర్థులపైనా, పలు విదేశాలపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.