చరణ్ సినిమాలో అనుపమకు నో ఛాన్స్
ధృవ లాంటి బిగ్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఓ డిఫరెంట్ సినిమాలో నటించనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరికి ఓకె చెప్పాడు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. 90లలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్గా ఎవరిని ఫిక్స్ చేయాలన్న విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడింది.
ముందుగా రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుందన్న వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం రాశీపై ఫోటో షూట్ కూడా చేసిన యూనిట్ ఆమెను పక్కన పెట్టేశారు. తరువాత 'అ..ఆ..', 'ప్రేమమ్' సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ను ఈ సినిమాకు హీరోయిన్గా తీసుకుంటున్నారన్న వార్త వినిపించింది.
చాలా రోజులుగా ఈ సినిమాలో అనుపమనే హీరోయిన్ అన్న ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు కాదన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి హీరోయిన్ ఎంపిక జరగలేదని త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తామన్నారు యూనిట్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి వరుస సూపర్ హిట్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.