బెల్లంకొండ సాయి శ్రీనివాస్
‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తనలోని నటుణ్ణి మరింత సానపెడుతున్నారు యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. గురువారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సాయీ.. హ్యాపీ బర్త్‌డే. సాయి శ్రీనివాస్‌తో ‘అల్లుడు శీను’ సినిమా చేసాను.
కొత్త హీరోతో చేసినట్లు అనిపించలేదు. అలవాటు ఉన్న హీరోతో చేసిన అనుభూతి కలిగింది. బోయపాటిగారితో మంచి యాక్షన్ సినిమా చేశాడు. ఆర్టిస్టుగా సాయి మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. సాయి ఇంకా పెద్ద హీరో అవుతాడు. సినిమా ఫెయిల్యూర్స్ అందరికీ వస్తాయి. కానీ సాయి మాత్రం ఫెయిల్ అవ్వలేదు. అవ్వడన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సాయి శ్రీనివాస్ బెల్లంకొండకు పుట్టినరోజు∙శుభాకాంక్షలు. సాయి హీరోగా కంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్.
సాయి హీరో అవుతానన్నప్పటి నుంచి అతని వర్క్ చూస్తూనే ఉన్నాం. సందేహం లేదు. సినిమా సినిమాకి యాక్టింగ్, డ్యాన్స్‌లో ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మంచి కథలను ఎంపిక చేసుకుంటే టాలీవుడ్‌లో సాయి శ్రీనివాస్ వన్నాఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేదు. సరైన ఆర్టిస్టుకు మంచి సినిమా పడితే మంచి స్టార్ హీరోగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
సాయికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఇంతకుముందు ‘దిల్’ రాజుగారు మాట్లాడుతూ మంచి కథలను ఎంపిక చేసుకోవాలి అన్నారు.ఇప్పుడు మేం సాయితో చేస్తున్న సినిమా కథ భిన్నమైనదని అనుకుంటున్నాం. యాక్షన్, డ్యాన్స్‌ల్లో సాయిని పర్‌ఫెక్ట్‌గా చూసి ఉంటారు. ఈ సినిమాలో తన నటనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర.
‘‘ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల జాబితాలోకి సాయిగారి పేరు ఈ ఏడాదే చేరుతుందని చెప్పగలను’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘నన్ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ అంకుల్ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. అనిల్‌గారు వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అజయ్ భూపతిగారికి, ఇంకా నిర్మాతలు అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్‌కి ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, బెక్కెం వేణుగోపాల్, మల్టీ డైమన్షన్ వాసు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment