
ముందు వాళ్లు.. తరువాత నేను
కోలీవుడ్‌లో పెళ్లికాని ఏజ్‌బార్ హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో ముందు వరుసలో నిలిచేది ఆర్య, శింబు, జయ్‌ల పేర్లను పేర్కొనవచ్చు. వీరి ముగ్గురిపై హీరోయిన్లతో కలుపుతూ పుకార్లు జోరుగానే సాగుతున్నాయి. ఆర్య తన సరసన నటించిన హీరోయిన్లందరితోను రొమాన్స్ చేస్తాడనే టాక్ బహిరంగంగానే వినిపిస్తుంది. ఇక శింబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నయనతార, హన్సికల గురించి కథలు కథలుగా ప్రచారం అయ్యాయి.
యువ నటుడు జయ్ ఈ విషయంలో తక్కువేమీ కాదు. అలాంటి జయ్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నిస్తే, ముందు ఆర్య, శింబులను పెళ్లి చేసుకోమని చెప్పండి ఆ తరువాత ఈ ప్రశ్న తనను అడగండి అంటున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తాను నటనే చాలనుకోవడం లేదని, అందువలనే కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నానని తెలిపారు. తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా తన ఆసక్తిని కాదనలేక కారు రేసింగుకు అంగీకరించారని చెప్పారు. నటి నజ్రియాతో కలసి నటించిన తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం తెరపైకి వచ్చిందన్నారు.
ఈ చిత్ర విడుదలలో జాప్యానికి కారణాలు చాలా ఉన్నాయని చెప్పారు. కొన్ని సంప్రదాయ వేడుకలను నిజంగానే చిత్రీకరించాలని భావించామని చెప్పారు. ఆ సమయం కోసం వాటి అనుమతి కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని వివరించారు. ఇక తన పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారని ఈ ప్రశ్నను మొదట శింబు, ఆర్య, విశాల్ ను అడగండి అని అన్నా రు. వాళ్లు పెళ్లి చేసుకున్న తరువాత తా ను చేసుకుంటానని అన్నారు. తన వయసు చాలా తక్కువని ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని జయ్ అన్నారు.