
కావలసినన్ని గొడవలు, కాసిన్ని అలకలు, మరికాసిన్ని బుజ్జగింపులతో సాగుతున్న బిగ్‌బాస్ హౌస్‌లో నేడు పంద్రాగస్టు వేడుకలు నిర్వహించనున్నారు. గత ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో అలీ రెజా, రవి, రాహుల్ ముగ్గురు పాల్గొన్నప్పటికీ యుద్ధం మాత్రం అలీ, రాహుల్ మధ్యే జరిగింది. ముఖ్యంగా శ్రీముఖి, శివజ్యోతి, హిమజలు అలీకి మద్దతుగా నిలిచారు. వీరిని దాటి ముందుకెళ్లడం రాహుల్‌కు కష్టంగానే మారింది. ఎంత పోరాడినప్పటికీ విజయం అలీనే వరించింది. ఈ వారం రోహిణి ఎలిమినేట్ అవుతుంది అన్న శ్రీముఖి మాటలతో రోహిణి కంటనీరు పెట్టుకుంది. తన స్నేహితురాలు అయి వుండి మొహం మీదే నువ్వు ఎలిమినేట్ అవుతావు అని చెప్తే ఎలా అంటుంది అని బాధపడింది. కాసేపు దీనిపై గొడవ జరిగినా రోహిణి, శ్రీముఖిలు కలిసి మాట్లాడుకుని గొడవ సెటిల్ చేసుకున్నారు. ఇక శ్రీముఖి పదేపదే రాహులనుద్దేశించి నమ్మి మోసపోయానని విసుగు వ్యక్తం చేసింది.
ఇక ప్రోమో విషయానికొస్తే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇంటిని రంగురంగుల బెలూన్లతో అందంగా అలంకరించారు. ‘భారత్ మాతాకీ జై..’ అంటూ ప్రారంభమైన ఈ ప్రోమో చూస్తుంటే ఇంటి సభ్యులు అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారనిపిస్తుంది. వారి మధ్య వైరాలను పక్కనపెట్టి మరీ ఉల్లాసంగా గడిపినట్టు తెలుస్తోంది. స్టేజ్‌పై ఆటలు, పాటలతో నేడు ఫుల్ జోష్‌లో ఎపిసోడ్ కొనసాగనుంది. కెప్టెన్సీ టాస్క్‌లో గెలుపు నీదా, నాదా? అని కొట్టుకునే స్థాయికి వెళ్లిన కంటెస్టెంట్లు నేటి ఎపిసోడ్‌లో కాస్త కూల్ అయినట్టుగా ఉన్నారు. ఇక రెండో కెప్టెన్‌గా ఎన్నికైన అలీ రెజా, శ్రీముఖితో కలిసి ఇంటి సభ్యులందరి తరపున ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజాగా విడుదల చేసిన మరో ప్రోమోలో వేడుకలు, వినోదంతోపాటు సందేశాత్మకంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో స్కిట్ చేయించారు. ఇందులో ప్రేమికుల పాత్ర పోషించిన రవి, వితిక ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుస్తారు. వారి మాటలను బట్టి స్త్రీ వివక్ష గురించి స్కిట్ చేస్తున్నట్టుగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 74 ఏళ్లు గడిచినా సమాజం పురుషులను, స్ర్తీలను సమానంగా చూడట్లేదు. స్త్రీని దేవతగా పూజించే భారతదేశంలో అతివ అవమానాల పాలవుతోంది. చులకనగా మారుతోంది. వీటన్నింటికి మూల కారణాన్ని ఇంటి సభ్యులు కనుగొంటారా.! మరోవైపు ఆడపిల్ల ఎన్ని బాధలు ఎదుర్కొన్నా మౌనంగానే అన్నీ భరించాలా? ఎదుటివారు తప్పుచేసి తనను నిందిస్తున్నా సర్దుకుపోవాలా? ఆడపిల్లకు కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేదా..? అన్న ప్రశ్నలను లేవనెత్తేలా ఉంది. ఆడపిల్లవై ఉండి అంత నోరేసుకుని అరుస్తావా? అని మహేశ్ ఎందుకు మండిపడతాడు? చివర్లో వరుణ్ అడిగిన ప్రశ్నకు ఇంటి సభ్యులు ఏం సమాధానమిస్తారు? అసలు వీరు చెప్పాలనుకున్న సందేశమేంటి? ఈ చిక్కు ప్రశ్నలన్నింటికీ నేటి ఎపిసోడ్ బదులివ్వనుంది.
#IndependenceDay celebrations in the house 🇮🇳#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/GVvMCmYgXp
— STAR MAA (@StarMaa) August 15, 2019
#BiggBossTelugu3 house celebrates #IndependenceDay 🇮🇳
— STAR MAA (@StarMaa) August 15, 2019
Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/h4C0jTg92F