పుస్తకావిష్కరణలో కృష్ణ, విజయనిర్మల, రేలంగి నరసింహారావు, నరేశ్....
‘‘ఒక వివాహ వేడుకలా అద్భుతంగా జరిగిన ఈ అంకితోత్సవం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో అందమైన విషయాలతో కూడిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని తెలుగు సినిమాకు బహూకరిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఇంత మంచి గ్రంథాన్ని మాకు అంకితం చేసినందుకు రచయిత డా. కె.ధర్మారావుకు అభినందనలు’’ అని ‘తెలుగు సినిమా గ్రంథం’ స్వీకర్తలు కృష్ణ, విజయనిర్మల అన్నారు. సినీ లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, రామానాయుడు, డి.వి.ఎస్.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన ‘ఫిలిం అనలిటికల్ అండ్ అసోసియేషన్’ (ఫాస్), డా. కె.ధర్మారావు రచించిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ గ్రంథం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
విశిష్ట అతిథి, దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘484 పేజీల్లో విషయం, మరో 24 పేజీల రంగుల పుటలతో విశిష్ట సమాచారంతో పాటు చక్కటి ఫొటోలతో తెలుగు సినిమా విశేషాలను ఈ గ్రంథంలో బాగా ఆవిష్కరించారు. ఇది కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఎన్‌సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా చరిత్రను ధర్మారావు చక్కగా విశదీకరించి, తెలుగు సినిమా సేవలో మరో అడుగు ముందుకు వేశారు’’ అన్నారు నటుడు నరేశ్. ఈ సమావేశానికి ముందు గాయకులు టి.లలితరావు, డా. టీవీ రావు కలిసి కృష్ణ, విజయనిర్మల నటించిన చిత్రాల్లోని పాటలను పాడి అలరించారు. రచయిత కె.ధర్మారావు, రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, డా.కీమల ప్రసాదరావు, ఫాస్ గౌరవాధ్యక్షులు ప్రసాదరావు, కొదాల బసవరావు, రచయిత భార్య ఆదుర్తి సూర్యకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment