
ఐదు రోజులు ముందే గుడ్ న్యూస్
చిరంజీవి అభిమానులు తియ్యని కబురు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఆయన నటించబోయే 151వ చిత్రం ప్రకటన కోసం కొన్ని నెలలుగా ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్లుగా ఈ చిత్రం కోసం చిరంజీవి కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ 22న ఆయన బర్త్‌డే. ఆ రోజున ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో అనుకున్నారు. కానీ, ఐదు రోజులు ముందే ఆ గుడ్ న్యూస్ చెప్పేశారు.
చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌పై చిరు తనయుడు, హీరో రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయాలని దర్శక–నిర్మాతలు భావిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’, ‘మహావీర’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మరి.. ఈ రెండిటిలో ఒక టైటిల్‌ని సెలక్ట్ చేస్తారో? వేరే టైటిల్ పెడతారో చూడాలి.