ఒకరిలా ఇంకొకరు కనిపించడం అసాధ్యం. మేకప్‌తో కొంతవరకూ మేనేజ్ చేయొచ్చు. కానీ పూర్తిగా చేయగలిగితే మాత్రం అద్భుతం అనే అనాలి. ఇప్పుడు దీపికా పదుకోన్‌ని అందరూ అలానే అంటున్నారు. ఎందుకంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయారామె. ఆ మార్పుని చూడగానే ‘ఈవిడ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కదా’ అని అనుకోకుండా ఉండరు. అంతలా దీపిక తన లుక్‌ని మార్చుకున్నారు. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా దీపిక చేస్తున్న చిత్రం ‘ఛపాక్’. ఈ చిత్రంలో దీపిక లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ఇప్పటివరకూ దీపిక చేసిన సినిమాలు ఓ ఎత్తు ఈ సినిమా మరో ఎత్తు. ఇందులో డీ–గ్లామరైజ్డ్ రోల్‌లో కనిపిస్తారు.
లక్ష్మీ జీవితానికి దీపిక ఎంతగా ఇన్‌స్పైర్ అయ్యారంటే.. కేవలం ఆమె పాత్రను పోషించడమే కాదు.. ఈ చిత్రానికి ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. జీవితంలో వచ్చిన పెద్ద కుదుపు నుంచి ధైర్యంగా తేరుకున్న లక్ష్మీ పాత్రలో ఒదిగిపోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు దీపిక. ఆమెలా మారడానికి గంటలు గంటలు మేకప్‌కి కేటాయించాల్సిందే. దీపికను ఎక్కువ కష్టపెట్టే పాత్ర. అయినా ఆనందంగా చేస్తున్నారు. ‘‘ఈ పాత్ర నాతో ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టాం’’ అన్నారు దీపిక. ‘రాజీ’ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో దీపిక పాత్ర పేరు మాల్తీ. వచ్చే ఏడాది జనవరి 10న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment