అందాల భామ ప్రియా ఆనంద్ కోలీవుడ్ మీడియాపై గుర్రు మీదున్నారు. స్వలాభం కోసం తనలాంటి వారిని పావులుగా చేసి ఆడటం సమంజసం కాదని ఘాటుగానే స్పందించారు.
అందాల భామ ప్రియా ఆనంద్ కోలీవుడ్ మీడియాపై గుర్రు మీదున్నారు. స్వలాభం కోసం తనలాంటి వారిని పావులుగా చేసి ఆడటం సమంజసం కాదని ఘాటుగానే స్పందించారు. ఇంతకీ ప్రియా ఆనంద్‌కు కోపం తెప్పించిన విషయం ఏంటా అనుకుంటున్నారా? అయితే విషయంలోకెళ్దాం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకునిగా తమిళంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ముందు కథానాయికగా అనుకున్నది ప్రియానే నట. అయితే... ఆ సినిమా విషయంలో సదరు నిర్మాతలను ఈ ముద్దుగుమ్మ 50 లక్షలు డిమాండ్ చేశారని, దాంతో షాక్ తిన్న నిర్మాతలు అక్కడ్నుంచీ పలాయనం చిత్తగించి, తెలుగమ్మాయి శ్రీదివ్యను కథానాయికగా తీసుకున్నారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో మనస్తాపానికి గురైన ప్రియాఆనంద్ పై రీతిలో స్పందించారు. ఇంకా చెబుతూ -‘‘డబ్బే ముఖ్యం అనుకుంటే... ఈ పాటికి తీరిక లేకుండా సినిమాలు చేస్తుండేదాన్ని.
మంచి పాత్రల కోసం ఎదురుచూస్తూ... సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను కాబట్టే కెరీర్ మొదలై నాలుగేళ్లు కావస్తున్నా... తక్కువ సినిమాలే చేశాను. తమిళంలో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కారణంగా డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. దానికి లేనిపోనివి సృష్టించి రాసేశారు. నేను యాభై లక్షలు అడిగానని రుజువు చేస్తే... వారికి యాభై లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ అన్నారు ప్రియా ఆనంద్.