సినిమా పారితోషికం విషయంలో తారతమ్యం గురించి హీరోయిన్లలో అసంతృప్తి చాలా కాలంగానే రగులుతోంది. ఈ విషయమై పలువురు ప్రముఖ కథానాయికలు తరచూ తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. తాము హీరోలకు ఏ మాత్రం తీసిపోమని, అయినా పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం ఉంటోందని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేరింది. ఈ ఉత్తరాది బ్యూటీ దక్షిణాదిలోనే కథానాయికగా మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది.
తమిళంలోనూ పలు చిత్రాల్లో నటింనా పెద్దగా విజయాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. శివకార్తికేయన్ సరసన నటించిన అయిలాన్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఏదేమైనా ప్రస్తుతం రకుల్ ప్రీతీ సింగ్ మార్కెట్ డౌన్ అయ్యిందని చెప్పక తప్పదు. అయినప్పటికీ పారితోషికం విషయంలో కొందరు హీరోయిన్లు పాడిన పాటనే ఈమె పాడుతోంది.
ఇటీవల ఒక భేటీలో హీరోహీరోయిన్ల మధ్య పారితోషికం విషయంలో తారతమ్యాల గురించి స్పందిస్తూ.. హీరోల కంటే హీరోయిన్లకు పారితోషికం తక్కువగానే ఉంటోందని పేర్కొంది. నిజం చెప్పాలంటే హీరోహీరోయిన్ల ప్రతిభను బట్టే పారితోషికాన్ని నిర్ణయించాలంది. అలా కాకుండా హీరోలకే అధిక పారితోషికం ఇచ్చే పరిస్థితి మారాలని ఆకాంక్షించింది. సినిమా కోసం హీరోహీరోయిన్ ఒకే మాదిరి శ్రమిస్తారని, అయినా పారితోషికం విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారంది. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే ప్రతిభ హీరోయిన్లకూ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమాలో కథా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే అది సక్సెస్ అయినట్లేనని, అంతే తప్ప అందులో ఎవరు నటించారన్నది ముఖ్యం కాదని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment