
సాక్షి, హైదరాబాద్ : అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి విచ్చేయనున్నారు. ఇక ఆమె రాకపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో కామెంట్లు చేశాడు.
‘నాకు ఏ మాత్రం రాజకీయ అవగాహన లేదు. ఇవాంక హైదరాబాద్‌లో ఎందుకు పర్యటిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె అందాన్ని చూడటానికి మాత్రం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. గతంలో సన్నీ లియోనీ ఇండియాకు వచ్చినప్పడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో.. ఇప్పుడూ అంతే ఆత్రుతతో ఉన్నా ’ అని వర్మ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇవాంకను బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో పోలుస్తూ వర్మ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, ఈ నెల(నవంబర్) 28న జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమ్మేళనానికి ఇవాంక హాజరుకాబోతున్నారు. మూడు రోజులపాటు ఈ సమ్మేళనం జరగనుంది. ఎనిమిదో సమ్మేళనాన్ని భారత్-అమెరికాలు సంయుక్తంగా భారత్‌లో నిర్వహించాలని గతేడాది ప్రధాని మోదీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్ణయించిన విషయం తెలిసిందే.