ప్రపంచ సినిమా ఒక అధిరోహకుడైతే అతణ్ణి సవాలు చేసే ఎవరెస్ట్ ఆస్కార్. ప్రపంచ సినిమా ఒక నావ అయితే దాని సత్తా సవాలు చేసే పసిఫిక్ ఆస్కార్. ప్రపంచ సినిమా ఒక ప్రయోగం అయితే దాని ఫలితాలను నిగ్గుతేల్చే సైంటిస్ట్ ఆస్కార్. కథలన్నీ కంచికి చేరుతాయో లేదో కాని సినిమాలన్నీ ఆస్కార్‌కు చేరాలని కలలు కంటాయి. ఆస్కార్ వేదిక మీద తన సినిమా ప్రస్తావన రావాలని, తనకు అవార్డు దక్కాలని వేల మంది గొప్ప గొప్ప నటీనటులు, దర్శకులు కష్టపడుతూ ఉంటారు. ఆస్కార్‌లో బహుమతి గెలుచుకున్న చిత్రం ప్రపంచానికి తెలుస్తుంది. ఆస్కార్ గెలుచుకున్న నటుడు గౌరవంగా తలెత్తి చూసే స్థాయిలో నిలబడతాడు. ఆస్కార్ గెలుచుకున్న నటి వెండి తెర ఇలవేలుపుగా మారుతుంది. ఆస్కార్ మీద ఆశలు ఎన్నో అభాండాలు అన్ని. వివక్ష ఉంటుందని పక్షపాతం ఉంటుందని ఎన్నో అభిప్రాయాలు ఆరోపణలు. కాని ఈసారి మాత్రం ఆస్కార్‌లో స్త్రీలు తమ ప్రతిభ చాటారు. నటనలో, సాంకేతిక విభాగాలలో మగవాళ్లకు గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి ఆస్కార్ ఆమె ఆస్కార్‌గా నిలిచింది. ఆస్కార్ ఆమెది కూడా అని రుజువు చేసింది.
నెల రోజులుగా ఊరిస్తున్న అత్యంత ఘనమైన 91వ ఆస్కార్ వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్ వేడుకగా ఆదివారం జరిగింది. ఎవరూ అంచనా పెట్టుకోని ‘గ్రీన్‌బుక్’ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ను గెలుచుకుంది. ‘బొహెమియన్ రాప్సోడి’ చిత్రానికి నాలుగు,‘ రోమా’,‘ బ్లాక్ పాంథర్’ సినిమాలకు చెరి మూడు ఆస్కార్‌లు దక్కాయి. 2019 ఆస్కార్ వేడుకలో ప్రధానంగా కనిపించిన అంశం అకాడమీ మహిళలను గుర్తించడం. కొత్త కొత్త విభాగాల్లో స్త్రీలు అవార్డులు గెలుచుకొని రికార్డ్ సృష్టించారు. హోస్ట్ లేకపోయినా మాయ రుడాల్ఫ్, టినా ఫే, అమీ పోయిల్హర్ అవార్డ్ షోను విజయవంతంగా ప్రారంభించారు. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో ‘హన్నా బీచ్లర్’ అవార్డ్ పొందారు. ‘బ్లాక్ పాంథర్’ సినిమాలో సూపర్ హీరో స్వస్థలం ‘వాకాండా’ సృష్టి ఆమెకు ఈ అవార్డ్‌ను సాధించిపెట్టింది. ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకన్న తొలి నల్ల జాతీయురాలు ఈమే. ఇక కాస్ట్యూమ్ విభాగంలో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న నల్ల జాతీయురాలుగా రూత్ కార్టర్ రికార్డు సాధించింది. నాన్ యాక్టింగ్ కేటగిరీలో కాకుండా ఇతర విభాగాల్లో నల్లజాతీయులు అస్కార్ అందుకోవడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే ఉత్తమ సహాయనటి విభాగంలో ‘రెజీనా కింగ్’ అనే నల్ల జాతీయురాలు అస్కార్డ్ అవార్డు అందుకున్నారు. ఇలా ఒకే ఏడాది ముగ్గురు నల్ల జాతీయులూ ఆస్కార్ అందుకోవడం కూడా ఇదే మొదటిసారి. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మెక్సికన్ చిత్రం ‘రోమా’ స్త్రీల కథాంశం కలిగి ఉండటం కూడా మరో విశేషం. ఈ విభాగంలో మెక్సికోకు ఇదే తొలి ఆస్కార్ కావడంఇంకో విశేషం. ఈ చిత్ర దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్‌కు 2014లో ‘గ్రావిటీ’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు. ఈ యేడాది ఒకే చిత్రానికి (రోమా) సినిమాటోగ్రఫీ, డైరెక్టర్ రెండు విభాగాల్లో రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇలా గెలుచుకున్న మొదటి వ్యక్తి కూడా అల్ఫాన్సో కావడం విశేషం.
రోమా ఉత్తమ విదేశీభాషా చిత్రం
రోమా సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇంగ్లిష్‌లో తీయని ఒక సినిమా అత్యధిక ఆస్కార్ అవార్డులకు నామినేట్ కావడం. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విదేశీభాషా చిత్రం సహా మొత్తం పది విభాగాల్లో ఇది నామినేట్ అయింది. ఇన్ని నామినేషన్లు పొందడం ఇంతకుముందు కేవలం 2000 సంవత్సరంలో వచ్చిన ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్’కే సాధ్యమైంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విదేశీభాషా చిత్రం అవార్డులను రోమా గెలుచుకుంది. ఇంగ్లీషేతర సినిమా మూడు అవార్డులు గెలవడం కూడా ఒక ఘనత. ఇంకో విశేషం, రోమాకు సినిమాటోగ్రఫీ కూడా దర్శకుడు అల్ఫాన్సో క్వేరాన్ చేయడంతో రెండు కీలక అవార్డులను వ్యక్తిగతంగా ఆయన గెలుచుకున్నట్టయింది. 2013లో గ్రేవిటీ చిత్రానికిగానూ దర్శకుడిగా తొలి ఆస్కార్ గెలుచుకున్న క్వేరాన్ ఆ ఘనత సాధించిన తొలి లాటిన్ అమెరికన్ దర్శకుడు అయ్యాడు. అయితే అది పూర్తిగా హాలీవుడ్ చిత్రం. కానీ రోమా ఆయన దేశమైన మెక్సికో నేపథ్యంలో సాగే ఆయన మార్కు స్పానిష్ సినిమా. 1970ల్లో మెక్సికో సిటీలోని రోమా ప్రాంతంలో ఇద్దరు ఆడవాళ్లు చేసిన పోరాటం రోమా ఇతివృత్తం. పనిమనిషి క్లియో, ఆమె యజమానురాలు సోఫియా. ఇద్దరూ ఉమ్మడిగా నష్టపోయింది మగవాళ్ల వల్ల. క్లియో దృష్టికోణంలో కథ సాగుతుంది. కడుపు మాత్రం చేసి ఏ బంధపు బరువు మోపుకోకుండా క్లియోను వదిలేస్తాడు ప్రియుడు. నలుగురు పిల్లలు అయిన తర్వాత డాక్టర్ అయిన భర్త వేరే స్త్రీ మోజులో సోఫియాను వదిలేస్తాడు. భిన్న వర్గాలకు చెందిన ఈ స్త్రీలు ఈ కష్ట సమయంలో ఒకరికొకరు మానసిక ఆలంబన అవుతారు. రాజకీయాంశాలను బలంగా వ్యక్తీకరించే క్వేరాన్ గొప్పతనం ఎక్కడంటే, క్లియో ప్రియుడు ఫెర్మిన్‌ను పారామిలిటరీ బలగాల్లో చేర్చడం. సరిగ్గా క్లియోకు నెలలు నిండిన సమయంలో రేగిన విద్యార్థుల నిరసన జ్వాలలను అణచివేసే బలగాల్లో ఫెర్మిన్ ఉండటమూ, అతడి అసలైన కర్కశ ముఖం చూసిన భయంలో క్లియో గర్భాన్ని పోగొట్టుకోవడమూ సినిమా కేవలం ఇది ఇద్దరు ఆడవాళ్ల కథ మాత్రమే కాదనుకునేలా చేస్తుంది. స్థూలస్థాయిలో ఇందులో కనబడేది రాజ్యపు విధ్వంసం, సూక్ష్మస్థాయిలో అర్థమయ్యేది ఆ ధ్వంసమవుతున్నదాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు చేసే ప్రయత్నం. దానికి రుజువు, అంతకుముందు నీటిని చూసి భయపడే క్లియో, సముద్రంలో మునిగిపోతున్న యజమానురాలి పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకోవడం. ఇది పాక్షికంగా క్వేరాన్ ఆత్మకథాత్మక చిత్రం. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రించడంతో రంగుల్నీ చూసీ చూసీ అలసిపోయివున్న కళ్లకు నలుపు తెలుపుల్లోని హాయి ఏమిటో తెలుస్తుంది. విదేశీభాషా విభాగంలో మెక్సికో నుంచి ఆస్కార్ గెలుచుకున్న తొలి చిత్రం కావడం ఒక విశేషమైతే, నెట్‌ఫ్లిక్స్ దీన్ని పంపిణీ చేయడం ఇంకో సంగతి.
ప్రసంగాలూ... స్ఫూర్తిమాటలూ
ఆస్కార్ వేడుకలో అవార్డ్ ఎవరికొస్తుంది అన్నదాని కంటే, అవార్డ్ అందుకున్న విజేత వేదిక మీద కృతజ్ఞతా పలుకుగా ఏం మాట్లాడతారన్నదానిమీదే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. 1942లో ‘మిసెస్ మిన్వెర్’ సినిమాకు ఉత్తమ నటిగా ఎంపికైన గ్రీర్ గార్‌సన్ ఆపకుండా ఆరునిమిషాలు మాట్లాడిందట. దాంతో ఆ ఏడాది నుంచి ఆస్కార్ యాక్సెప్టెన్స్ స్పీచ్‌ను 45 సెకండ్లకు కుదించింది అకాడమీ. అయితే 45 సెకన్లలో మాట్లాడడానికి థాంక్స్ తప్ప ఇంకేం మాటలుంటాయి అని అసహనపడకండి. నలభై అయిదు సెకన్లలో ఆలోచింపచేయొచ్చు, నవ్వించొచ్చు, బోర్ కొట్టించొచ్చు అని ఆస్కార్ కమిటీ అభిప్రాయం. దాన్ని ఫాలో అవమని స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్. ఆ నియమం ఆధారంగా గతేడాది టాక్ ఆఫ్ ది నైట్ అయ్యారు ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ స్పీచ్‌లో ‘ఇన్‌క్లూజన్ రైడర్’ అనే పదం వాడారామె. ‘సినిమా సెట్లో వర్ణ, లింగ నిష్పత్తి సమంగా ఉండేలా చూసుకోవడం’ అని ఆ మాట అర్థం. ఈ ఏడాది ఉత్తమ నటి పురస్కారం అందుకున్న ఒలివియా కోల్మన్ అవార్డ్ అందుకోగానే ‘దిస్ ఈజ్ హిల్లేరియస్.. నాకు ఆస్కార్ వచ్చిందా? సరే. థాంక్స్ చెప్పాల్సిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఒకవేళ మర్చిపోతే దయచేసి క్షమించండి. మళ్లీ కలిసినప్పుడు ప్రేమతో ఓ ముద్దిస్తాను. ఆస్కార్ స్పీచ్‌లు ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిలందరూ.. ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. క్లీనర్‌గా పని చేసే రోజుల్లో నేను ఎక్కువగా చేసిన పని ఇదే. థాంక్యూ ఎవ్రీ వన్’ అంటూ తన స్పీచ్‌ని పూర్తి చేశారు. అవార్డ్ గెలుచుకున్న నటీనటులు సాధారణంగా ‘థాంక్స్ టు గాడ్’ అని దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు. అయితే ఒలివియా మాత్రం ‘థాంక్స్ టు లేడీ గాగా’ అంటూ లేడీగాగాకు కృతజ్ఞతలు చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తర్వాత ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో అవార్డ్ అందుకున్న రేకా ‘మెన్‌స్ట్రుయేషన్ మీద తీసిన సినిమాకు ఆస్కార్ వస్తుందని అనుకోలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా!’ అన్నారు. ‘ఎన్నిసార్లు ఒడిపోయామన్నది ముఖ్యం కాదు. మళ్లీ ఎన్నిసార్లు తిరిగి ప్రయత్నించావన్నది ముఖ్యం. విజయం సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన తపన ఉండాలి’ అంటూ స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చారు లేడీ గాగా. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ‘‘షాలో’’కి ఆస్కార్ తీసుకున్నారు ఆమె. ‘వైస్’ చిత్రానికి గాను మేకప్ విభాగంలో.. గ్రెగ్ కన్నమ్, కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ.. ఆస్కార్‌ని గెలుచుకున్నారు. రాసుకొని తెచ్చుకున్న థాంక్యూ చీటీని వంతుల వారీగా చదువుదామనుకున్నారు. తీరా చదవాల్సిన టైమ్‌కి కన్ఫ్యూజ్ అయ్యారు. దాంతో ఈ ఏడాది వరస్ట్ స్పీచ్ ఇదే అంటూ సోషల్ మీడియా కామెంట్స్ బారిన పడ్డారు.
మాటల బాణాలు.. ట్రంప్ మీదా?
‘ప్రపంచ వేదిక సాక్షిగా మా పూర్వీకులందరినీ గుర్తుచేసుకుంటున్నా. ఈ దేశాన్ని నిర్మించింది వాళ్లే. మానవత్వాన్ని పెంపొందించుకోవడమే నిజమైన ఉద్యమం. 2020 ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయ్. అందరం చరిత్రకు సరైనవైపే ఉందాం. ప్రేమ వైపు ఉందామా? ద్వేషం వైపు ఉందామా? అందరం సరైన నిర్ణయం తీసుకుందాం!’ అన్నారు దర్శకుడు స్పైక్ లీ. ఇది ఆయన ఆస్కార్ స్పీచ్‌కన్నా ఆస్కార్ వేదికగా డొనాల్డ్ ట్రంప్‌కి విసిరిన బాణంలా అభిప్రాయపడ్డారు వీక్షకులు. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే (బ్లాక్లాంన్స్‌మాన్) విభాగంలో ఆయన ఆస్కార్‌ను అందుకున్నారు. 2015లో గౌరవ ఆస్కార్ అందుకున్నప్పటికీ ఇది అతని తొలి అవార్డు. అవార్డ్ అనౌన్స్ చేసిన సామ్యూల్ జాక్సన్‌పై అమాంతం దూకారు స్పైక్ లీ. ‘యాక్సెప్టెన్స్ స్పీచ్ టైమర్ అప్పుడే ఆన్ చేయకు’ అంటూ ఆస్కార్ ప్రొడ్యూసర్‌కి కేకేశారు.
జెంటిల్‌మేన్ ఆఫ్ ది నైట్
‘అండ్ ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ టు రెజినా కింగ్’ అని అనౌన్స్ చేశారు. రెజినా ఉత్సాహంగా లేచారు. అవార్డ్ అందుకోబోయే కంగారులో డ్రెస్ కొంచెం ఇబ్బంది పెట్టడంతో వేగంగా కదల్లేకపోయారు. దాంతో ముందు వరుసలో కూర్చున్న ‘కెప్టెన్ అమెరికా’ పాత్రధారి క్రిస్ ఈవన్ రెజీనాకు తన చేయి అందించాడు. అంతేకాదు స్టేజ్ వరకూ ఆమెను నడిపించుకుంటూ వెళ్లాడు. దీంతో ఇంటర్‌నెట్ మొత్తం ‘జెంటిల్‌మేన్ ఆఫ్ ది నైట్’ అంటూ క్రిస్‌ను హైలైట్ చేసింది.
హోస్ట్ లేకపోతే ఏంటి?
ఒక థీమ్‌కు సంబంధించిన మోనోలాగ్‌తో ఆస్కార్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. దానికి ఒక హోస్ట్ ఉంటారు. అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకకి థీమ్ లేదు. హోస్ట్ లేరు. అయితేనేం మేమున్నామంటూ సాటర్‌డే నైట్ స్టార్స్ టినా ఫే, మాయా రుడాల్ఫ్, అమీ పోయిలీర్ చిన్న మోనోలాగ్‌తో ఆస్కార్ ఆస్కార్ వేడుకను ప్రారంభించారు. ఆ తర్వాత వరుస జోక్స్‌తో వేడుకను ముందుకు తీసుకెళ్లారు. ఏదో ఓ జోక్‌ను పేల్చి ‘మేమే హోస్ట్స్ అయ్యుంటే ఇలా అనేవాళ్లమేమో?’ అంటూ నవ్వులు పూయించారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ అందించడానికి స్టేజ్ మీదకు వచ్చిన ఈ స్నేహితులు ‘బేసిక్‌గా ఉమెన్ అంటేనే సపోర్టీవ్. నమ్మరా? వీళం్లదరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేది నేనే’అనే చలోక్తులు చిమ్మారు.
ఆస్కార్.. నాట్ సో వైట్
‘ఆస్కార్.. .తెల్ల జాతీయుల పక్షపాతి’ అనే అపవాదును మొన్నటి వరకూ ఉండేది. పోయిన ఏడాది నుంచి ఆ పక్షపాతం చాలా తగ్గింది అంటున్నారు విశ్లేషకులు. ఈ ఏడాది అవార్డులను అందుకున్న వారే కాదు అందించిన వాళ్లూ విభిన్నమైన వాళ్లే. రూత్ కార్టర్– కాస్ట్యూమ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న మొదటి అఫ్రికన్ అమెరికన్. యానిమేటడ్ ఫిల్మ్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న మొదటి నల్ల జాతీయుడు పీటర్ రామ్సే. ఇలా ఈ ఏడాది వర్ణాలకు అతీతంగా షో జరగడంతో ఆస్కార్.. నాట్ సో వైట్ అనే మంచి పరిణామానికీ తెర తీసింది.
డ్రైవింగ్‌లో ఆస్కార్ మిస్
ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘గ్రీన్‌బుక్’ చిత్రాన్ని ప్రకటించడం చాలామందికి రుచించలేదు. ఒక నల్లజాతి పియానిస్ట్, ఓ తెల్ల జాతి డ్రైవర్ కలిసి చేసిన ప్రయాణమే ‘గ్రీన్‌బుక్’. ఈ చిత్ర దర్శకుడు పీటర్ ఫారెల్లీపై లైంగిక వేధింపుల ఆరోపణలూ ఉన్నాయి. ‘ఎవరో ఎవర్నో డ్రైవ్ చేసిన ప్రతిసారి నేనోడిపోతున్నాను’ అంటూ ‘గ్రీన్‌బుక్’ విజయంపై కామెంట్ చేశారు దర్శకుడు స్పైక్ లీ. ఆయన తీసిన ‘బ్లాక్లాంన్స్‌మాన్’ చిత్రానికి బెస్ట్‌ఫిల్మ్ మిస్ అయ్యింది. 1989లో కూడా ‘డ్రైవింగ్ మిస్ డైసీ’ చిత్రం పోటీగా నిలిచి స్పైక్ లీ తీసిన ‘డూ ది రైట్ థింగ్’కు అస్కార్ మిస్ అయ్యేలా చేసింది.
హైలైట్స్
∙ఆస్కార్ స్టేజ్ సెటప్ అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టయిల్‌ని తలపించేలా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ‘ఆర్ట్‌లో ఒక్కొక్కరు ఒక్కో బొమ్మను వాళ్లకు నచ్చిన విధంగా ఊహిస్తూ చూస్తారు. ట్రంప్ హెయిర్‌స్టయిల్‌లా ఊహించుకున్న వాళ్లకు అలా కనపడి ఉండొచ్చు’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్.
∙ఈ ఏడాది బెస్ట్ యాక్ట్రెస్ ఆస్కార్‌ను నటి గ్లెన్ క్లోజ్ గెలుస్తుంది అని అనుకున్నారంతా. గ్లెన్ కూడా తన డ్రెస్‌ను ఆస్కార్ అవార్డ్ ప్రతిమలా డిజైన్ చేసుకుంది. దాదాపు 20 కిలోల బరువున్న ఈ డ్రెస్‌తో రెడ్ కార్పెట్ పై నడిచి అందరి చూపులనూ తన వైపు తిప్పుకుంది. కాని ఆమెకు అవార్డు రాలేదు.
∙ఈ ఫంక్షన్‌లో లేడీ గాగా, బ్రాడ్లీ కూపర్ పాడిన ‘షాలో’ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది.
∙రెండు ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న మొదటి నల్లజాతీయుడు మహర్షెల్లా అలీ. ఈ ఏడాది గ్రీన్‌బుక్ చిత్రానికి ఆయన ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ తీసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం మూన్‌లైట్ చిత్రానికి ఉత్తమసహాయనటుడు విభాగంలో తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు మహర్షెల్లా అలీ.
∙ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ గెలిచారు రోమీ మాలిక్. ఆ అవార్డు అందుకున్న తొలి అరబ్ అమెరికన్ వ్యక్తి రోమీ మాలిక్. స్పీచ్ ఇచ్చిన తర్వాత స్టేజీ మీద నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారు.
∙గత ఆరేళ్లుగా యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో డిస్నీ సంస్థకు ఆస్కార్ అవార్డులు వస్తూన్నాయి. ‘స్పైడర్‌మ్యాన్: ఇట్ టు ది స్పైడర్ వర్స్’ చిత్రంతో ఆ స్పీడ్‌కు బ్రేక్ వేసింది సోనీ. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ ఏడాది ఆస్కార్‌ను చేజిక్కించుకుంది. అయినా డిస్నీ ఆస్కార్ ఖాతాలో ఈ యేడాదీ ఆస్కార్ పడింది.. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ‘బావ్’తో.
∙ ‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ చిత్రం ఈ ఏడాది ఎనిమిది ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకుంది. కానీ ఒరిజినల్ స్కోర్ విభాగంలో మాత్రమే ఆస్కార్ అవార్డును అందుకోగలిగింది.
విజేతల జాబితా
ఉత్తమ చిత్రం: గ్రీన్‌బుక్
ఉత్తమ డైరెక్టర్: అల్ఫాన్సో క్వేరాన్ (రోమా)
ఉత్తమ నటుడు : రమీ మాలిక్ (బొహెమియన్ రాప్సోడి)
ఉత్తమ నటి: ఒలివియా కోల్మన్ (ద ఫెవరెట్)
ఉత్తమ సహాయ నటుడు: మహర్షెల్లా అలీ (గ్రీన్‌బుక్)
ఉత్తమ సహాయ నటి : రెజీనా కింగ్ (ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్)
ఒరిజినల్ స్క్రీన్ ప్లే : గ్రీన్‌బుక్
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : బ్లాక్లాంన్స్‌మాన్ (స్పైక్ లీ)
ఉత్తమ విదేశీ చిత్రం : రోమా
యానీమేటెడ్ ఫీచర్ : స్పైడర్‌మ్యాన్: ఇన్ టు ది స్పైడర్ వర్స్
సౌండ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి
విజువల్ ఎఫెక్ట్స్ : ఫస్ట్‌మ్యాన్
ఫిల్మ్ ఎడిటింగ్ : బొహెమియన్ రాప్సోడి
యానీమేటెడ్ షార్ట్: బావ్
లైవ్ యాక్షన్ షార్ట్: స్కిన్
డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్: పీరియడ్: ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్
ఒరిజినల్ స్కోర్ : బ్లాక్ పాంథర్
ఒరిజినల్ సాంగ్ : షాలో (ఏ స్టార్ ఈజ్ బార్న్)
ప్రొడక్షన్ డిజైన్: బ్లాక్ పాంథర్ (రూత్ కార్టర్)
సినిమాటోగ్రఫీ : రోమా (అల్ఫాన్సో క్వేరాన్)
క్యాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్ (హన్నా బీచ్లర్ )
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: వైస్ ( గ్రెగ్ కన్నమ్,
కేట్ బిస్కోయి, పాట్రికా డిహానీ లీ)
డాక్యుమెంటరీ ఫీచర్: ఫ్రీ సోలో
సౌండ్ మిక్సింగ్ : బొహెమియన్ రాప్సోడి
Comments
Please login to add a commentAdd a comment